కరీంనగర్ రూరల్, వెలుగు : కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. గుండెపోటుతో తల్లి చనిపోయింది. ఈ ఘటన కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్ లో శుక్రవారం జరిగింది. సీఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... దుర్శేడ్ కు చెందిన బిల్లా సవిత (65), సత్యనారాయణ కూతురు శ్రీవిద్య (36)కు పదేండ్ల కింద జగిత్యాలకు చెందిన తిరుపతితో వివాహమైంది.
శ్రీవిద్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో దుర్శేడ్ లోని తల్లిగారింట్లో ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. శుక్రవారం ఉదయం బాత్ రూమ్ కు వెళ్లిన శ్రీవిద్య బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే కరీంనగర్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
శ్రీవిద్య మృతితో ఆమె తల్లి సవిత, తండ్రి సత్యనారాయణ ఉదయం నుంచి రోదిస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవిద్య మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్తుండగా.. ఆమె తల్లి సవిత గుండెనొప్పితో కుప్పకూలింది. వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు.. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. గంటల వ్యవధిలోనే తల్లీకూతురు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో
మునిగిపోయారు.
