తొర్రూరు, వెలుగు: భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన బ్లూకోట్స్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తి, ఇనుప రాడ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని 14వ వార్డు గంగోత్రి వాటర్ ప్లాంట్ ఎదురుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారంటూ డయల్ 100కు సమాచారం అందింది.
దీంతో తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో బ్లూకోట్స్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ జాటోత్ రామచంద్ర రాత్రి సుమారు 11.20 గంటలకు అక్కడికి చేరుకున్నారు. గొడవకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్న క్రమంలో దంతాలపల్లి మండలం ఆగపేట తూర్పు తండాకు చెందిన కోటేశ్వర్ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఒక్కసారిగా రామచంద్రపై కత్తి, ఇనుపరాడ్డుతో దాడి చేశాడు.
గుండె సమీపంలో కత్తితో పొడవడంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ వాహనంలో ఆయనను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించి ఆరు కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కోటేశ్వర్‌ను అరెస్టు చేశారు. తొర్రూరు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గణేశ్ తెలిపారు.
