మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: విద్యా వాలంటీర్లు కేవలం పాఠాలు బోధించేవారిగా కాకుండా పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా పని చేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 100 ప్రభుత్వ స్కూల్స్ సేవలందించేందుకు ఎంపికైన 100 మంది విద్యా వాలంటీర్లకు తన సొంత నిధులతో మొదటి నెల గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10 లక్షలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అకడమిక్స్‌తో పాటు నైతిక విలువలు, మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని ప్రత్యేకంగా మార్గనిర్దేశనం చేయాలన్నారు. చదువును మధ్యలోనే నిలిపివేయాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లల భవిష్యత్‌పై నమ్మకం కల్పించాలని సూచించారు. క్రీడలు, కళలు, ఇతర రంగాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు. నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నాయకులు ఉన్నారు.
