రూ.46 లక్షల అమెజాన్ జాబ్ మానేసిన టెక్కీ.. ఇప్పుడు ఆర్మీలో ఏం చేస్తున్నాడో తెలుసా?

రూ.46 లక్షల అమెజాన్ జాబ్ మానేసిన టెక్కీ.. ఇప్పుడు ఆర్మీలో ఏం చేస్తున్నాడో తెలుసా?

లక్నోకు చెందిన 27 ఏళ్ల అమెజాన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శార్దేందు తివారీ రూ.46 లక్షల హై పెయిడ్ జాబ్ వదులుకుని, దేశసేవ కోసం ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌ను ఎంచుకున్నారు. గయలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సైనిక అధికారిగా కమిషన్ పొందనున్నారు. ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్‌బస్ నుంచి కూడా ఆఫర్ వచ్చినప్పటికీ.. వాటిని కాదనుకుని మరీ దేశ రక్షణ రంగాన్ని ఎంచుకోవడం విశేషం. కార్పొరేట్ ప్రపంచంలో లక్షలాది రూపాయల జీతం, సుఖవంతమైన జీవితం కంటే దేశం కోసం సేవ చేయాలనే తపనే ఈ దారిలో నడిపించింది. 

శార్దేందు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కుటుంబ నేపథ్యమే. ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో 36 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసి రిటైర్ అయిన హానరరీ కెప్టెన్ రాజ్‌కుమార్ తివారీ కుమారుడే ఈ శార్దేందు. లక్నోలోని నీల్‌మఠా ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం, సుల్తాన్పూర్ జిల్లా పైపర్‌గావ్ గ్రామానికి చెందినది. చిన్నప్పటి నుంచి తండ్రి పడే శ్రమను, సైనిక జీవితంలోని విలువలను చూస్తూ పెరిగిన శార్దేందు మనసులో ఆర్మీపై మమకారం బలపడింది. చండీమంద్రిర్‌లోని కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆయన.. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి టెక్‌ రంగంలో స్థిరపడ్డారు.

అయితే మనసులో ఉన్న సైనిక కలలను సాకారం చేసుకోవడం కోసం శార్దేందు ఎంతో పట్టుదలగా శ్రమించారు. ఆర్మీ సెలెక్షన్ ప్రక్రియలో 7 సార్లు విఫలమైనప్పటికీ నిరుత్సాహపడకుండా.. 8వ ప్రయత్నంలో టెక్నికల్ రూట్ ద్వారా విజయం సాధించారు. తనకున్న టెక్నాలజీ నైపుణ్యాలను సైనిక సేవకు జోడించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నారు. గయలోని ఓటీఏ శిక్షణ సమయంలోనూ తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి.. అత్యంత ప్రతిష్టాత్మకమైన 'సీనియర్ అండర్ ఆఫీసర్' హోదాను దక్కించుకున్నాడు. 

లక్షల రూపాయల జీతాన్ని ఇట్టే వదిలేసి.. దేశభక్తే సర్వస్వంగా ముందుకు సాగిన శార్దేందు ప్రయాణం నేటి యువతకు నిజంగా ఓ గొప్ప స్ఫూర్తిదాయకం. కేవలం కార్పొరేట్ ఉద్యోగాల వెనుక పరుగులు పెట్టే యువతరానికి, దేశసేవ కంటే మించింది ఏదీ లేదని నిరూపించి చూపించారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని సైనిక దళాల అభివృద్ధికి ఉపయోగించాలనే అతని ఆలోచన దేశానికి ఎంతో గర్వకారణం. ఒక సాధారణ ఇంజనీర్ నుంచి గర్వించదగిన సైనిక అధికారిగా శార్దేందు మారిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.