- ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ
- సెప్టెంబర్ 5న కొడంగల్లో అవార్డుల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాను ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్, కాలేజీ, టెక్నికల్ విద్యాశాఖలు, యూనివర్సిటీల నుంచి మొత్తం 123 మంది టీచర్లను ఎంపిక చేశారు. గురువారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్లో మొత్తం 52 మంది ఉండగా, వారిలో జీహెచ్ఎంలు 10 మంది, స్కూల్ అసిస్టెంట్లు 16, ఎస్జీటీలు 17, టీజీటీ/పీఈటీ, సీఆర్టీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ మరో 9 మంది ఉన్నారు.
ఇంటర్ విద్యలో మొత్తం 10 మంది ఉండగా వారిలో నలుగురు ప్రిన్సిపాళ్లు, ఏడుగురు జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ముగ్గురు, అఫిలియేటెడ్ కాలేజీల్లో 29 మంది డీఎల్స్, పీడీ, లైబ్రేరియన్ ఉన్నారు. మరోపక్క18 యూనివర్సిటీల నుంచి 28 మందిని బెస్ట్ టీచర్స్ అవార్డుల కోసం ఎంపిక చేశారు. దీంట్లో అగ్రికల్చర్ వర్సిటీ నుంచి ఐదుగురు, ఓయూ నుంచి నలుగురు, జేఎన్టీయూ నుంచి ఇద్దరు ఉండగా, మిగిలిన వర్సిటీల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వీరందరికీ శనివారం జరిగే టీచర్స్ డే వేడుకల్లో అవార్డులను అందించనున్నారు.
హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ వీరే..
రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్స్ అవార్డుల జాబితాలో జీహెచ్‌ఎంలుగా ఎంపికైన వారిలో బురుగు నీరజ (జీహెచ్‌ఎం, జీహెచ్‌ఎస్ బాబు క్యాంప్, భద్రాద్రి), వి. మాలతి (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ మాధాపూర్, యాదాద్రి), కొల్లూరి వెంకటమ్మ (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ ఫతేపూర్, మహబూబ్ నగర్), ఎస్. భాగ్యలక్ష్మి (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ పెద్దకడుమూరు, నారాయణపేట), ఎండీ సలీం షరీఫ్ (జీహెచ్‌ఎం, పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ కోదాడ, సూర్యాపేట), సురభి దేవేందర్ రావు (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ చుక్కాపూర్, కామారెడ్డి), గుండా రాజన్న (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ కిష్టాపూర్, మంచిర్యాల), సి. దశరథ్ (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ తొగర్‌పల్లి, సంగారెడ్డి), కొమ్మవరపు కృష్ణయ్య (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ దట్ల, మహబూబాబాద్), వి. నిరంజన్ (జీహెచ్‌ఎం, జెడ్పీహెచ్‌ఎస్ అంబట్‌పల్లి, నాగర్‌కర్నూల్) ఉన్నారు. అలాగే ప్రిన్సిపాల్ హోదాలో ఎంపికైన వారిలో టీ. శ్రీనివాస్ (ప్రిన్సిపాల్, నిజామాబాద్ డైట్) ఎం. గోవింద రాజులు (ప్రిన్సిపాల్, సీటీఈ, మహబూబ్ నగర్), శివరామకృష్ణ (ప్రిన్సిపాల్, జీజేసీ మల్యాల, జగిత్యాల), ఎం.విజయ లక్ష్మి (ప్రిన్సిపాల్ జీజేసీ చందుర్తి, రాజన్న సిరిసిల్ల), మోహన్ రావు (ప్రిన్సిపాల్, జీజేసీ నాంపల్లి, నల్గొండ), టీ శ్రీనివాస్ రావు (ప్రిన్సిపాల్, జీజేసీతాడ్వాయి, కామారెడ్డి) ఉన్నారు.
కొడంగల్లో టీచర్స్ డే..
టీచర్స్ డే అధికారిక వేడుకలు తొలిసారిగా హైదరాబాద్ జిల్లా దాటి ఇతర జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 5న వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరపాలని నిర్ణయించారు. అక్కడి సర్కారు జూనియర్ కాలేజీలో ఉదయం 9గంటలకు అవార్డులను అందించనున్నారు. తన సొంత నియోజకవర్గంలో జరిగే ఈ వేడుకులకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరుకానున్నారు.
