- పలు చోట్ల చేలకు వైరస్, ఇతర చీడపీడలు
- భారీగా పడిపోనున్న దిగుబడులు
- ఆందోళనలో పత్తి రైతులు
మహబూబ్నగర్, వెలుగు : పత్తి పంటలకు కష్టకాలం వచ్చింది. ఈ వానాకాలం సీజన్లో విత్తు విత్తుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాతావరణంలో వస్తున్న మార్పులతో పంటలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వారం, పది రోజుల కిందటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో చేలు ఆశించిన స్థాయిలో ఎదుగకపోగా, తాజాగా చేలకు ఆశించిన స్థాయిలో పూత, కాయలు పట్టడం లేదు. కొద్దో గొప్పో పడుతున్న పూత, కాయలు కూడా పంటలకు తెగుళ్లు సోకుతుండడంతో రాలిపోతున్నాయి.
ఒక్కో చెట్టుకు పది కాయలు కూడా లేవు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో ఈ వానాకాలం సీజన్లో పత్తి పంటలు సాగువుతుండగా, అత్యధికంగా నాగకర్నూల్ జిల్లాలో 2.60 లక్షల ఎకరాల్లో, నారాయణపేటలో 1.50 లక్షల ఎకరాలు, మహబూబ్నగర్లో లక్ష ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. రోహిణి కార్తె ప్రారంభం కాగానే వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు పెద్ద మొత్తంలో పత్తి విత్తనాలను విత్తుకున్నారు. మృగశిర కార్తె ప్రారంభం కాగానే నైరుతి రుతు పవనాలు వచ్చినా వర్షాలు పడలేదు. దీంతో పత్తి మొక్కలు మొలకెత్తలేదు.
జూన్ ముగిసినా లోటు వర్షపాతమే నమోదు కావడంతో నీరు అందక పత్తి విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. దీంతో జులైలో రెండోసారి పత్తి విత్తనాలు విత్తుకున్న రైతులకు అడపా దడపా వర్షాలు పంటలకు జీవం పోశాయి. కానీ భారీ వర్షాలు పడకపోవడంతో భూమి పదునెక్కక పత్తి చేన్లు ఎదగలేదు. వర్షాలు సమృద్ధిగా పడి వాతావరణం అనుకూలిస్తే ఒక్కో పత్తి చెట్టుకు 50 నుంచి 60 కాయలు పట్టాల్సి ఉండగా, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక చెట్టుకు కనీసం పది కాయలు కూడా లేవు. పూత వస్తున్నా చెట్లు బలంగా లేక రాలిపోతున్నాయి. కాయ పడుతున్నా తెగుళ్లు సోకుతుండడంతో అవి కూడా నేలరాలుతున్నాయి. ఆకాశం మబ్బులు కమ్మి, చెట్లకు సూర్యరశ్మి కూడా సరిగా తగలడం లేదు. చెట్లకు బోరాన్, నత్రజని, బాస్వరం, పొటాష్ వంటి పోషకాలు కూడా అందక కాయలు రాలిపోతున్నట్లు వ్యవసాయధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల పచ్చదోమ, ఆకమచ్చ తెగుళ్లు కూడా సోకుతుండడంతో పత్తి కాయలు రాలిపోతున్నట్లు రైతులు చెబుతున్నారు.
దిగుబడి పడిపోయే పరిస్థితి..
తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. వాస్తవానికి ఎకరానికి 12 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడులు రావాల్సి ఉండగా, ఈసారి ఎక్కువ శాతం పత్తి కాయలు రాలిపోతుండడంతో ఐదు నుంచి ఏడు క్వింటాళ్లలోపే పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పత్తి కూడా నాణ్యతగా ఉంటుందా? లేదా? అనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒక్కో రైతు ఎకరా పత్తి సాగుకు దాదాపు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. రెండు సార్లు పత్తి విత్తనాలను విత్తుకోవాల్సి రావడంతో పెట్టుబడి పెరిగిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే కనీసం పెట్టుబడులు చేతికొస్తే చాలనుకుంటున్నారు.
రూ.4 లక్షల పెట్టుబడి పెట్టిన..
పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట ఏసిన. ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. కానీ చేనును చూస్తే కండ్ల నీళ్లొస్తున్నయి. ఇప్పటి వరకు ఒక్కో చెట్టుకు 40కిపై గా కాయలు పట్టాలె. కానీ ఏ చెట్టుకూ పదికి మించి కాయాల్లేవు. ఈసారి మొత్తం నష్టపోయేలా ఉన్న. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పుడు వానలు పడినా.. ఉన్న కాయలు రాలిపోతాయి. ఏంచేయలో తెలుస్తలేదు.
-కె.బాబు, రైతు, జంగంరెడ్డిపల్లి, నర్వ మండలం, నారాయణపేట జిల్లా
చేను పచ్చగా ఉన్నా కాయలు మాత్రం లేవు..
ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మొత్తం పత్తి పెట్టిన. నిరుడు కూడా పత్తి పెడితే లాభం బాగా వచ్చింది. అదే ఉత్సాహంతో ఈసారి పత్తి పెట్టిన కానీ వానలు సరిగా లేక పంట పెరగలే. చేను పచ్చగా ఉన్నా కాయలు మాత్రం కనిపిస్తలేవు. నిరుడు ఐదు ఎకరాల్లో 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారి పది క్వింటాళ్లు కూడా వచ్చేలా లేదు. -మన్యంకొండ, రైతు, తుంకినిపూర్, మూసాపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా
