కేసీఆర్ వెయ్యి రోజుల్లో ఒక్కరోజు బయటకు రాలే..  1000 రోజుల్లో ఒక్క సెలవు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ వెయ్యి రోజుల్లో ఒక్కరోజు బయటకు రాలే..  1000 రోజుల్లో ఒక్క సెలవు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి

తాను వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుంటే, మరో నేత వెయ్యి రోజుల్లో ఒక్కరోజు కూడా బయటకు రాలేదని పరోక్షంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రెండేళ్ల సమయం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, లేదంటే రాబోయే ఎన్నికల్లో తనకు మార్కులు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేది, వారి భవిష్యత్తుకు పునాది వేసేది టీచర్లేనని ఆయన కొనియాడారు.

గత పదేళ్ల కాలంలో ఉపాధ్యాయులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, జీతాలు ఎడమొహం పెడమొహంగా ఉండేవని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తన జీతం రాకపోయినా ప్రతినెలా 1వ తారీఖునే ఉపాధ్యాయులకు జీతాలు అందిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి, 11 వేల ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామని తెలిపారు.

గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తాము వచ్చాక విడుదల చేశామని, ప్రభుత్వ ఉపాధ్యాయులను విదేశాలకు పంపి అధ్యయనం చేయించామని సీఎం వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని, జాతీయ స్థాయిలో ప్రభుత్వ విద్యలో తెలంగాణ 17వ స్థానానికి చేరుకుందని తెలిపారు.