ఎడ్యుకేషన్ లో‘ఎక్సలెన్స్’ అవార్డ్..మంచిర్యాల కలెక్టర్ విద్యారంగంపై స్పెషల్ ఫోకస్

ఎడ్యుకేషన్ లో‘ఎక్సలెన్స్’ అవార్డ్..మంచిర్యాల కలెక్టర్ విద్యారంగంపై స్పెషల్ ఫోకస్
  • మంచిర్యాల కలెక్టర్​కు ‘ఎక్సలెన్స్​ ఇన్​ ఎడ్యుకేషనల్​అడ్మినిస్ట్రేషన్’ అవార్డు
  • విద్యారంగంపై స్పెషల్ ​ఫోకస్​ 
  • స్టూడెంట్స్​ ఎన్​రోల్​మెంట్​లో రాష్ట్రంలోనే ఫస్ట్
  • పీజీఐ ర్యాంకింగ్​లో సెకండ్​ ప్లేస్​లో నిలిచిన జిల్లా
  • కలెక్టర్ నిరంతర పర్యవేక్షణతో దక్కిన గుర్తింపు 

మంచిర్యాల, వెలుగు: ఈ విద్యాసంవత్సరం గవర్నమెంట్ ​స్కూళ్లలో 96.3 శాతం స్టూడెంట్స్​ ఎన్​రోల్​మెంట్​ సాధించి మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్​ప్లేస్​లో నిలిచింది. అలాగే ప్రైవేట్​ స్కూళ్ల నుంచి సర్కారు బళ్లలో విద్యార్థుల చేరికలోనూ, పర్ఫార్మెన్స్​ గ్రేడింగ్​ ఇండెక్స్​ (పీజీఐ) ర్యాంకింగ్​లోనూ వరుసగా ఫస్ట్, సెకండ్​ప్లేస్​లు సాధించింది. 

తన ప్రణాళికలు, పనితీరుతో విద్యారంగంలో విశిష్ట ఫలితాలు సాధించినందుకు గాను కలెక్టర్​ కుమార్​ దీపక్​ను ప్రభుత్వం ‘ఎక్సలెన్స్​ఇన్​ఎడ్యుకేషనల్​అడ్మినిస్ట్రేషన్​2026’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా గురువారం ఆర్డర్స్​జారీ చేయడం తెలిసిందే. శనివారం కొడంగల్ గవర్నమెంట్​జూనియర్ కాలేజీలో నిర్వహించే టీచర్స్​డే వేడుకల్లో సీఎం రేవంత్​రెడ్డి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డును అందుకోనున్నారు.

నిరంతర పర్యవేక్షణతో.. 

కలెక్టర్ కుమార్​ దీపక్ ​జిల్లా పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఫీల్డ్​విజిట్లతో బిజీగా ఉన్నప్పటికీ సమాజ భవిష్యత్​ను తీర్చిదిద్దే విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇతర శాఖల కంటే విద్యాశాఖకు ఎక్కువ టైమ్​ కేటాయిస్తూ డీఈవో నుంచి టీచర్ల వరకు అందరితో సమన్వయం​చేసుకుంటూ పక్కా ప్లానింగ్​తో ముందుకు సాగారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో డీఈవో రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు, అవలంభించిన వినూత్న విధానాలు, నిరంతర పర్యవేక్షణ ఇందుకు దోహదపడ్డాయి. 

విద్యాశాఖ సెక్టోరియల్​ఆఫీసర్లు, ఎంఈవోలు, స్కూల్​ క్లస్టర్​ హెచ్​ఎంలు, టీచర్లకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించి వారి పనితీరును ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం, సలహాలు, సూచనలు అందించి ఎంకరేజ్​ చేయడం, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం వంటి చర్యల ద్వారా రాష్ట్రంలోనే మంచి ఫలితాలు సాధించారు.

విద్యార్థుల నమోదు వివరాలు

2025–26 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2026–27లో 2,554 మంది స్టూడెంట్లు అదనంగా ప్రభుత్వ​స్కూళ్లలో చేరారు. 2024–25 నుంచి 2026–27 వరకు రెండేళ్లలో సర్కారు బళ్లలో 4,277 మంది విద్యార్థులు అదనంగా ప్రవేశాలు పొందారు. దీంతో అదనంగా 10.34 శాతం ఎన్​రోల్​మెంట్​ పెరిగింది. ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న విశ్వాసానికి, స్కూళ్లలో అందుతున్న నాణ్యమైన విద్యకు సూచికగా నిలిచింది.

 కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2025-–26 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్​వరకు విద్యా సంస్థల సమగ్ర పనితీరు ఆధారంగా రాష్ట్రాలు, జిల్లాల పనితీరును మదింపు చేస్తూ ఇటీవల పీజీఐ ర్యాంక్​లను రిలీజ్​ చేసింది. ఇందులో 360 స్కోర్​తో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.


 మందమర్రి, నస్పూర్, జైపూర్, హాజీపూర్, భీమారం మండలాల్లో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే అదనంగా 10 శాతానికి పైగా విద్యార్థుల నమోదు పెరిగింది. జిల్లాలోని 11 మండలాల్లో గత విద్యా సంవత్సరం కంటే అదనంగా 6 శాతానికి పైగా విద్యార్థులు నమోదయ్యారు. 282 గవర్నమెంట్​ స్కూళ్లలో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే 10 శాతానికి పైగా అదనపు విద్యార్థుల నమోదు సాధించింది. ఫలితంగా కలెక్టర్ కుమార్ దీపక్​కు​‘విద్యా పరిపాలనలో విశిష్ట ప్రతిభా పుర స్కారం-2026’ లభించింది.