టోల్ సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించారు...ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

టోల్ సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించారు...ఆదిలాబాద్ జిల్లాలో పశువుల అక్రమ రవాణా ముఠా అరెస్ట్

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపైకి వాహనాలు ఎక్కించి హత్యాయత్యానికి పాల్పడిన అంతర్రాష్ట్ర పశువుల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ రమేశ్ తెలిపారు.

 నేరడిగొండ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న మహేంద్ర బొలెరో వాహనాన్ని టోల్ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా.. నిందితులు గేట్లను ఢీకొంటూ వెళ్లిపోయారు. దాని వెనుక వచ్చిన కంటైనర్ లారీ సైతం టోల్​ప్లాజా వద్ద సైన్ కోన్లు, డివైడర్లను ఢీ కొట్టి పరారైంది. టోల్ ప్లాజా సూపర్​వైజర్ రామయ్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 3 తెల్లవారుజామున కుంటాల శివారులో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. 

వారి సమాచారంతో ఆదిలాబాద్ లో ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం తొమ్మిది మంది ఓ ముఠాగా ఏర్పడి మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతం నుంచి పశువులను అక్రమంగా రవాణా చేస్తూ నిజామాబాద్ జిల్లా సతాపూర్ వైపు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 24 ఎద్దులు, 23 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు పశువులు చనిపోగా మిగిలినవాటిని గోశాలకు తరలించారు. కంటైనర్ లారీ, నాలుగు గ్రాముల గంజాయి, మూడు మొబైళ్లను స్వాధీనం చేసుకొని , నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.