కాగజ్ నగర్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను రద్దు చేసి సిర్పూర్ సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు తీరని అన్యాయం చేసిన నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియోజకవర్గ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ దండే విఠల్ డిమాండ్ చేశారు.
శుక్రవారం కౌటాలలో ఏర్పాటు చేసిన సభలో రైతులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, నిషేధిత భూముల విషయంలో అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. శుక్రవారం రాత్రి కాగజ్ నగర్ లోని ఆయన నివాసంలో ప్రెస్ మీట్ లో మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, జడ్పీ మాజీ చైర్మన్ గణపతితో కలిసి మాట్లాడారు.
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తరలిస్తున్న సమయంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యేగా కోనప్ప కనీసం నిరసన కూడా తెలుపలేదని, ఇప్పుడు రైతుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కోనప్ప రైతుల భూ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
