భద్రాచలం ఆలయ పనుల్లో వేగం పెంచాలి.. మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాచలం ఆలయ పనుల్లో వేగం పెంచాలి.. మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ పునఃనిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణలతో కలిసి శుక్రవారం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆలయ పనులు 25 శాతమే జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మూడు షిఫ్ట్ ల్లో పనులు జరిగేలా యాక్షన్​ప్లాన్ తయారు చేయాలని సూచించారు. నిర్మాణాల్లో రాళ్ల క్వాలిటీ పక్కాగా ఉండాలని చెప్పారు. అన్ని పనులను దగ్గరుండి చూసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్​ను ఆదేశించారు. ఆలయ నిర్మాణాలకు సంబంధించిన ఏ నిర్ణయమైన తక్షణమే తీసుకోవాలని, వాటి జాబితా ప్రణాళికను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు.

గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే భద్రాచలానికి పోలవరం ముంపు ముప్పు ఏర్పడిందన్నారు. కేసీఆర్​నిర్లక్ష్యం కారణంగానే ఏడు మండలాలు ఆంధ్రాలో విలీనం అయ్యాయని మండిపడ్డారు. ఎల్​నినో ప్రభావంతో ప్రస్తుతం వరదలు లేకున్నా భవిష్యత్​లో భద్రాచలం నుంచి ములుగు వరకు సాధారణం కంటే 20 నుంచి 25 అడుగులు వరకు అధికంగా బ్యాక్ వాటర్​ ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

పోలవరానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తెలంగాణలో ముంపు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. అంతకుముందు భద్రాద్రి రాముణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఉత్సవాలనాటికి ఉత్తరద్వారం పనులు, పుష్కరాల నాటికి గోదావరి ఘాట్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

  • శిరీష కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కు అందజేత

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి, వెలుగు : స్టాఫ్​ నర్స్​గా పనిచేస్తున్న ఊకె శిరీషపై అత్యాచారం, హత్య ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటుగూడెంలోని శిరీష కుటుంబాన్ని పరామర్శించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల చెక్కు, ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్స్ అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శిరీషను హత్య చేసిన నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామన్నారు. సీఎంతో మాట్లాడి శిరీష కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట కోరం కనకయ్య, అడిషనల్ కలెక్టర్​ విద్యాచందన, హౌసింగ్​పీడీ సవయ్​రాం, ఆర్డీవో మధు, తహసీల్దార్​స్వాతి ఉన్నారు.