కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైందెక్కడ ? కేటీఆర్ పిచ్చి కూతలు మానుకోవాలి : మంత్రి సీతక్క

కేసీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలైందెక్కడ ? కేటీఆర్ పిచ్చి కూతలు మానుకోవాలి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : 'బీఆర్ఎస్​నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారు, పచ్చనాయకులు అని అంటున్న కేటీఆర్... మీ నాన్న కేసీఆర్​రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో ప్రజలకు చెప్పాలి' అని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ములుగులోని క్యాంప్ ఆఫీస్ లో ఆమె మాట్లాడారు.

గత పదేండ్లలో బీఆర్ఎస్​చేయలేని అభివృద్ధి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు. పచ్చ నాయకులంటున్న కేటీఆర్... తన పక్కన కూర్చున్న నాయకులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కావాలనే పోస్టర్లు క్రియేట్​ చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, అప్పుడే ప్రజలు గౌరవిస్తారన్నారు. మండల అధ్యక్షుడు ముస్నిపల్లి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.