పని చేసుకొని బతకమని చెప్పటమే పాపమైంది.. సూర్యాపేట జిల్లాలో తల్లిని పొట్టన పెట్టుకున్న కొడుకు

పని చేసుకొని బతకమని చెప్పటమే పాపమైంది..  సూర్యాపేట జిల్లాలో  తల్లిని పొట్టన పెట్టుకున్న కొడుకు

మఠంపల్లి, వెలుగు : పని చేసుకొని బతకాలని తల్లి మందలించడంతో ఆగ్రహానికి గురైన యువకుడు ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామంలో శుక్రవారం జరిగింది.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... షేక్ సైదాబీ (50) కొడుకు సుభానీకి గతంలో వివాహం కాగా కుటుంబ గొడవలతో భార్య పుట్టింట్లో ఉంటోంది. దీంతో తల్లితో కలిసి ఉంటున్నాడు. సుభానీ ఏ పనీ చేయకుండా తిరుగుతుండడంతో.. ఏదైనా పని చూసుకోవాలని సైదాబీ కొడుకును మందలించింది.

దీంతో ఆగ్రహానికి గురైన సుభానీ రోకలిబండతో కొట్టడంతో సైదాబీ అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.