యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణాష్టమి(కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలు) వేడుకలు శుక్రవారం షురూ అయ్యాయి. శ్రీవైష్ణవ పాంచరాత్ర ఆగమ శాస్త్రం పద్ధతుల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలను ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో అర్చకులు, వేదపండితులు ఉదయం ఆలయంలో చేపట్టిన ప్రత్యేక పూజలతో శ్రీకారం చుట్టారు. ఆలయ మాడవీధుల్లో ఉన్న అద్దాల మండపంలో చతుర్వేద పారాయణాలు, దివ్యప్రబంధ పాశుర పఠనాలు, ప్రత్యేక అర్చనలు, నివేదనలు, మంగళాశాసనాలు, చాత్మరా, తనియ విన్నపం వంటి పూజల నడుమ శ్రీకృష్ణుడి ఆవిర్భావ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు నయనానందకరంగా నిర్వహించారు.
కణ్ణన్ పెరుమాళ్లు, లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు ‘నవకలశ స్నపన విశేష తిరుమంజన సేవ’ కైంకర్యాన్ని అర్చకులు వైభవోపేతంగా నిర్వహించారు. శుక్రవారం మొదలైన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు 6న సాయంత్రం 5 గంటలకు ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట శిఖ్యోత్సవం(ఉట్లు కొట్టుట), రాత్రి 7.30 గంటలకు రుక్మిణీ కల్యాణం నిర్వహించనున్నారు. కృష్ణాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రతిరోజూ నిర్వహించే నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమం, భోగాలను శుక్రవారం ఒక్కరోజు తాత్కాలికంగా రద్దు చేశారు. ఆలయ ఈవో భవానీ శంకర్, వంశపారంపర్య ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నారసింహుడి సేవలో పలువురు ప్రముఖులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అల్పనా దూబే వేర్వేరుగా ఆలయానికి వచ్చి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు.
