హైదరాబాద్, వెలుగు: టీచర్లకు దసరా సెలవుల్లో బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని తెలంగాణ గవర్నమెంట్ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీటీజేఏసీ) డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ నాగులవంచ చంద్రశేఖర్ రావు, సెక్రటరీ జనరల్ శానమోని నర్సిములు మాట్లాడుతూ... ఇప్పటికే పీఆర్సీ కాలంలో 38 నెలలు నష్టపోయామని, వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించి తక్షణమే అమలు చేయాలని కోరారు.
సర్కారు మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2003 డీఎస్సీ టీచర్లకు కూడా ఓపీఎస్ వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన హెల్త్ కార్డులు ఆస్పత్రుల్లో సక్రమంగా చెల్లుబాటు అయ్యేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భాగస్వామ్య సంఘాలను సమన్వయం చేసుకుంటూ ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం దశలవారీగా ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని జేఏసీ నేతలు వెల్లడించారు. ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం మరిన్ని సంఘాలు జేఏసీలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు. కాగా టీజీటీజేఏసీ కొత్త కన్వీనర్‌గా చక్రవర్తుల శ్రీనివాస్‌ను ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
