సమ్మక్క సాగర్ కు ఎన్వోసీ ఇవ్వండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సమ్మక్క సాగర్ కు ఎన్వోసీ ఇవ్వండి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి నిల్వకు ఓకే చెప్పండి
  • చత్తీస్​గఢ్​ సీఎంకు ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్వోసీ ఇవ్వాలని చత్తీస్​గఢ్​ సీఎం విష్ణుదేవ్​ సాయ్​ను ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కోరారు. బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకుని లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుతో చత్తీస్​గఢ్​లో ముంపునకు గురయ్యే భూములు, నివాసాలకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

గురువారం ఆయన ఢిల్లీలో విష్ణుదేవ్​ సాయ్​తో భేటీ అయ్యారు. పెండింగ్ అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ఎన్‌వోసీ జారీ చేయాలన్నారు. ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయడానికి చత్తీస్​గఢ్​కు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్​ 29న రూ.9.883 కోట్లు చెల్లించామని మంత్రి ఉత్తమ్​గుర్తు చేశారు.

ఎఫ్‌ఆర్‌ఎల్, హై ఫ్లడ్ లెవెల్స్‌కు సంబంధించిన డీజీపీఎస్ సర్వే పూర్తయిందని, లైడార్ డ్రోన్ సర్వే, క్షేత్రస్థాయి డేటా సేకరణ పురోగతిలో ఉందని ఆగస్టు 7న చత్తీస్​గఢ్​ నుంచి రిప్లై వచ్చిందని చెప్పారు. ఎన్వోసీ ఇస్తే సెంట్రల్​ వాటర్​ కమిషన్​ నుంచి క్లియరెన్సులు వస్తాయన్నారు. చత్తీస్​గఢ్​ నుంచి ఎన్వోసీ వస్తే 46.96 టీఎంసీలు తరలించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఎస్సారెస్పీ స్టేజ్​ 2 కింద 4.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు వీలవుతుందన్నారు.

రామప్ప పాకాల లింక్​ కెనాల్​ ద్వారా ములుగులో 8 వేల ఎకరాలు, నర్సంపేటలో 22 వేల ఎకరాలకు నీళ్లతో పాటు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని స్థిరీకరించడం, తాగునీళ్లవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.