హిమాలయాలు ఆసియాకు కేవలం ప్రకృతి సౌందర్యాన్ని అందించే పర్వత శ్రేణులు మాత్రమే కావు. ఇవి కోట్లాది ప్రజల జీవనానికి ఆధారమైన జలవనరులకు నిలయాలు. శతాబ్దాలుగా పేరుకుపోయిన మంచు ఒత్తిడితో గట్టిపడి, తన బరువు కారణంగా పర్వతాల వాలుపై నెమ్మదిగా కదిలే భారీ మంచు ద్రవ్యరాశులను హిమానీనదాలు (గ్లేసియర్స్) అంటారు. ఇవి కరగడం ద్వారా వచ్చే నీరు గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి ప్రధాన నదులకు కీలక ఆధారం. అయితే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా హిమానీనదాలు వేగంగా కరుగుతున్నాయి. హిమాలయ ప్రాంతంలో ఈ మార్పు మరింత ఆందోళనకరంగా మారింది.
2026లో అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి కేంద్రం ( ఐసిఐఎంఓడి ) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2000 సంవత్సరం తరువాత హిందూకుష్–హిమాలయ ప్రాంతంలో మంచు నష్టం వేగం దాదాపు రెట్టింపైంది. హిమానీనదాలు వేగంగా కరగడం వల్ల మొదట నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ఆకస్మిక వరదలు సంభవించవచ్చు. అదే సమయంలో హిమానీనదాల సమీపంలో ఏర్పడే హిమ సరస్సులు ( గ్లేసియల్ లేక్ లు) ప్రమాదకర స్థాయికి చేరితే, వాటి కట్టలు తెగి ఉప్పొంగుతాయి. దీన్ని గ్లేసియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్ (జిఎల్ఓఎఫ్ఎస్) అంటారు.
తాగునీరు, వ్యవసాయం,జలవిద్యుత్ రంగాలపై తీవ్ర ప్రభావం
దీర్ఘకాలంలో హిమానీనదాల మంచు నిల్వలు తగ్గిపోతే నదుల్లో నీటి ప్రవాహం తగ్గి తాగునీరు, వ్యవసాయం, జలవిద్యుత్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇటీవల నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ మంచు–రాతి ఫలకాలు విరగడం, దాని తరువాత వచ్చిన ఆకస్మిక వరదలు హిమాలయ ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని మరోసారి ప్రపంచం దృష్టికి తెచ్చాయి. వాతావరణ మార్పులు, మంచు కరుగుదల, భారీ వర్షాలు, పర్వత ప్రాంతాల్లో భౌగోళిక అస్థిరత వంటి అంశాలు కలిసి ఇలాంటి విపత్తుల తీవ్రతను పెంచుతున్నాయి. ఇది కేవలం నేపాల్ సమస్య కాదు. హిమాలయ జలాలపై ఆధారపడే భారత్‌తోపాటు మొత్తం దక్షిణాసియాకు ఇది హెచ్చరిక. ఒకవైపు వరదలు, మరోవైపు భవిష్యత్తులో నీటి కొరత అనే రెండు ప్రమాదాలను మనం ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కర్బన ఉద్గారాలను తగ్గించడం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించడం, పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం అత్యవసరం. హిమానీనదాలు, హిమ సరస్సులను ఉపగ్రహాల ద్వారా నిరంతరం పర్యవేక్షించి, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాలి. హిమాలయ దేశాలు పరస్పరం సమాచారాన్ని పంచుకోవడం కూడా ఎంతో అవసరం. హిమాలయాలను కాపాడటం అంటే మంచును మాత్రమే కాపాడటం కాదు. నీటిని, ప్రకృతిని, వ్యవసాయాన్ని, జీవ వైవిధ్యాన్ని, కోట్లాది ప్రజల భవిష్యత్తును కాపాడటం. నేపాల్ విపత్తు మనందరికీ అందిస్తున్న సందేశం ఇదే.
- తుర్లపాటి నాగభూషణరావు
వండర్స్ ఇన్ నేచర్ పుస్తక రచయిత, పర్యావరణవేత్త
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
