- బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలిరోజుకు 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి
- అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు సింగరేణి సీఎండీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో రోజుకు 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితోపాటు రవాణా కూడా చేయాలని అధికారులను సింగరేణి సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఆదేశించారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంధన సరఫరా ఒప్పందం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్ లో సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పీఎంవో, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఇంధన శాఖ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గును అందించేందుకు సమీక్షలు నిర్వహించి లక్ష్యాలను నిర్దేశిస్తున్నామని చేప్పారు. దేశ ఇంధన భద్రత రీత్యా తగినంత బొగ్గును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థలపై ఉందని వివరించారు. సింగరేణి కూడా శక్తి వంచన లేకుండా కృషిచేసి బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచాలని సీఎండీ ఆదేశించారు.
ఐదు నెలల్లో 253 లక్షల టన్నులు రవాణా
ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఐదు నెలల కాలంలో ఆగస్టు 31నాటికి సింగరేణి సంస్థ 253 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసిందని సీఎండీ ప్రకటించారు. దీనిలో 90% పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేశామన్నారు. నైనీ బొగ్గు గని నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి, దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి మొదటి రైల్వే రేకుతో బొగ్గు సరఫరా చేశామని వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు నైనీ బ్లాక్ నుంచి బొగ్గును రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తామన్నారు.
