గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నాటి పాలకుల నిర్లక్ష్యంతో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా మారాయని, కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే చెన్నూరు రూపురేఖలు మారుతున్నాయని స్పష్టం చేశారు.మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్.. పట్టణాభివృద్ధే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, సమీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు పనులకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న స్థానిక ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనుల్లో ఉపాధి కోల్పోయే ప్రతి ఒక్కరికీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపులు నిర్మించి ఇస్తామని భరోసా ఇచ్చారు. అలాగే అమృత్ స్కీమ్ కింద రూ. 30 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
త్వరలోనే రానున్న గోదావరి పుష్కరాల కోసం చెన్నూరులో రూ. 70 కోట్లతో భారీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. జోడువాగుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవతో రూ. 100 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేకాకుండా, నియోజకవర్గంలో డిగ్రీ, జూనియర్ కళాశాల భవనాలు, రూ. 17 కోట్లతో టూరిస్ట్ సెంటర్ ఏర్పాటు, పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు, ఈ నెలలోనే 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఇదే సమయంలో బీజేపీ నేతల తీరుపై మంత్రి వివేక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు కావాలనే తప్పుడు ఆందోళనలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు. చెన్నూరు డిపో నిర్మాణ పనులను కూడా త్వరలోనే పునరుద్ధరించి ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తామని మంత్రి వివేక్ ధీమా వ్యక్తం చేశారు.
