వెలుగు ఓపెన్ పేజీ : ‘దఫ్తర్ ఠీక్ కరో!’  ఉద్యమమే దిక్కు!!

వెలుగు ఓపెన్ పేజీ : ‘దఫ్తర్ ఠీక్ కరో!’  ఉద్యమమే దిక్కు!!

ప్రభుత్వాల్లో అవినీతి మునుపెన్నడూ లేని స్థాయిలో రాజ్యమేలుతోంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదిప్పుడు బహిరంగ రహస్యమే! రాజకీయ అవినీతి ఒక ఎత్తయితే, ఆ నీడలో సాగుతున్న అధికారుల అవినీతికి అడ్డూ అదుపూ లేదు.  ప్రజలు నలుగుతున్నారు.  లంచాలివ్వకుండా పనులేవీ జరక్కపోవడం  రివాజయింది.  సక్రమంగా జరగాల్సినవి ఆగిపోయి, జరగకూడనివి అక్రమంగా జరగడానికీ కట్టలు తెగిన అవినీతే కారణం. అవినీతి పనుల్లో కొత్తకొత్త నమూనాలొస్తున్నాయి. ఏ స్థాయిలోనూ చట్టబద్ధపాలన (రూల్ ఆఫ్ లా) పట్ల అధికారుల్లో భక్తి, భయం కనబడట్లేదు.  పాలకులకు అంటే సర్కారు పెద్దలకు వ్యవస్థ మీద నియంత్రణే లేదు.

పరిమిత సంఖ్యలో  

ఏ కొందరినో మినహాయిస్తే... అధికారులు,  సిబ్బందిలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది.  చిన్న చిన్న ఉద్యోగులపై ఏసీబీ దాడుల్లో కూడా కోట్ల రూపాయల నగదు దొరకడం,  వందల కోట్ల ఆస్తుల వెల్లడి మచ్చుతునకలే!   దొరకని దొంగలే ఎక్కువ!  కాక్రోచ్ ఉద్యమకారులు ‘స్కూల్  ఠీక్  కరో’ అంటున్నట్టే  తెలుగు ప్రజలు చైతన్యమై ‘దఫ్తర్  ఠీక్  కరో’ అని ఉద్యమిస్తే తప్ప ఈ జాడ్యానికి పరిష్కారం దొరకదేమో?

అవినీతి వల్ల ఘోరంగా దెబ్బతింటూ కూడా పౌరులు ఆ విషయంపై  తగినంత కోపంగా లేరు ఎందుకో!  చొరవ తీసుకొని నాలాంటి వాళ్లు రాస్తే కూడా... నవ్వుకుంటారేమో?  ప్రభుత్వ వ్యవస్థలు సవ్యంగా పనిచేయకపోవడానికి, సగటు జీవన ప్రమాణాల్లో  మెరుగుదల లేక  ప్రజల్లో పెరుగుతున్న అశాంతికి అవినీతే ముఖ్య కారణం. సమాజంలో అసాధారణంగా పెరుగుతున్న ఆర్థిక అంతరాలకు కూడా అదే కారణం.  నిజంగా ప్రజలు దాన్నొక సీరియస్ అంశంగా తీసుకుని ఎన్నికలప్పుడు అదే స్థాయిలో స్పందిస్తే అవినీతిపరుల కూట్లు కదులుతాయి.   కానీ,  ప్రజలెందుకో ‘అవినీతి’ అంశాన్నే చూసీచూడనట్టు ఉదాసీనంగా వదిలేస్తున్నారు.  ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడాన్ని -అవినీతిలేని పాలనకు ముడిపెట్టడం లేదు.  తమ అవినీతిని ప్రశ్నించకుండా పౌరుల్ని అశక్తులను చేయడానికే నాయకులు వారిని కేవలం ఓటర్లుగా మార్చి, డబ్బుతో కొనుగోలు చేస్తున్నారేమో అనిపిస్తుంది.  ‘నీకది- నాకిది’ (క్విడ్ ప్రోకో) పద్ధతిలో నాయకులు,- అధికారులు పరస్పర ప్రయోజనం పొందే అవినీతి నమూనాను అన్ని స్థాయిల్లో అమలు చేస్తున్నారు.  ప్రజాప్రతినిధులన్నా అయిదేళ్లకోసారి ఎన్నికల్లో ‘ప్రజాతీర్పు’ అనే తనిఖీని ఎదుర్కొని వస్తున్నారు.  బదిలీ, సస్పెన్షన్ వంటి చిన్న చిన్న అవరోధాలు, భయాలే తప్ప పదవీవిరమణ (దాదాపు మూడున్నర దశాబ్దాలు) వరకు అధికారుల అవినీతికి అడ్డే లేదు. ఎటొచ్చి  ప్రజలు భంగపడుతున్నారు.

ఒకరిని మించి ఒకరు

అధికార అవినీతిలో  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోటీపడుతున్నట్టుంది.  అధికార యంత్రాంగంపై  పాలకులకు నియంత్రణ, పట్టు రెండూ సున్నాయే!  అట్టడుగున గ్రామం నుంచి అత్యున్నత సచివాలయం స్థాయి వరకు అంతటా అవినీతే!  చిన్న రెవెన్యూ ఇన్‌‌‌‌స్పెక్టర్, సర్వేయర్ స్థాయి ఉద్యోగిపై  ఏసీబీ దాడులు జరిపినా  రూ. కోట్ల  అక్రమాస్తులు వెలుగు చూస్తున్నాయి.  ఇక ఐ.ఎ.ఎస్, ఐ.పీ.ఎస్ స్థాయి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల్లో  అవినీతి గురించి చెప్పనవసరం లేదు.  వారిపై అవినీతి చర్యల ప్రక్రియ కూడా ఒక పెద్ద సంక్లిష్ట అవస్థ.  రాష్ట్ర, జిల్లా, ఇంకా కింది స్థాయి అధికారుల్లోనూ పట్టుబడేది  బహుకొద్దిమంది మాత్రమే! 2026 మొదటి ఆరు మాసాల్లో (జనవరి-– జూన్) రెండు తెలుగు రాష్ట్రాల్లోని  ఏసీబీ  కేసులు విస్తరిస్తున్న అవినీతికి ఒక సంకేతం మాత్రమే! ఇదంతా, నీటిలో కదిలే పెద్ద మంచుఖండం బయటకు కనిపించే పిసరులాంటిది.  ఏపీలో 6 మాసాల్లో 60 మంది లంచం తీసుకుంటూ/డిమాండ్ చేస్తూ రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుబడితే, 13 మంది ఆదాయానికి మించి ఆస్తులున్న (డీఏ) కేసుల్లో అరెస్టయ్యారు. మొత్తం 78 మందికి పైగా ఏసీబీ చర్యలకు గురయినట్టు నివేదికలున్నాయి. అదేకాలంలో 9 మందికి  ఏసీబీ కేసుల్లో శిక్షలు పడ్డాయి. విశాఖపట్నం, ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి అనంతపురంలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.  టీటీడీలో  డిప్యూటీ ఈవో స్థాయిలో పనిచేసిన అధికారి ఒకరు ఇటీవలే ఏసీబీ తాజా కేసులో అరెస్టయ్యారు. రూ.5 కోట్లకు పైగా ఆయన ఆస్తులు కూడగట్టినట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. అదే 6 మాసాల కాలంలో తెలంగాణలోనూ 62 మంది లంచం కేసుల్లో ఎసీబీకి పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసులు 13 మందిపై నమోదయ్యాయి. కోటి రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వారి వద్ద ప్రత్యక్ష ఆస్తుల్ని అధికారులు గుర్తించినా, మార్కెట్ విలువ ప్రకారం అవి అయిదారు వందల కోట్ల రూపాయల వరకుండొచ్చని అధికారుల అంచనా! ఇక ‘బినామీ ఆస్తుల’ లెక్కే తెలియదు.  ఇంతచేస్తే కూడా, రెండు రాష్ట్రాల్లోని ఏసీబీ విభాగాలు అరకొర సిబ్బందితో,  వనరులతో  ఇబ్బందిపడే పరిమిత విభాగాలే!

ప్రతిదీ ఓ కొత్త నమూనా

ఉద్యోగులే ఉద్యోగుల్ని అవినీతిపరులుగా మారుస్తున్నారు. చట్టబద్ధంగా  రావాల్సిన ఉద్యోగ  ప్రయోజనాలు,  ఇతర  బిల్లులు కూడా లంచం ఇవ్వకుండా క్లియర్ అవవు.  అవి పొందేందుకు వారు అవినీతి చేయాల్సి వస్తోంది. పౌరుల వద్ద డబ్బు తీసుకొని ఏ ఎల్లారెస్ కిందో,  బీఆరెస్ కిందో  క్రమబద్ధీకరించిన ఆస్తుల వ్యవహారంలోనూ అడ్డగోలు అవినీతి ఆలస్యంగా బయటకొస్తోంది.  గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌‌‌‌లో తక్కువ స్థలంలో పలు అంతస్తులుగా కట్టిన ఒక బిల్డింగ్ కూలిపోతే, అటువంటివే  ఓ 153 బంగ్లాలను ప్రస్తుతం కూలుస్తున్నారు.

 సర్కారే ఇచ్చిన సర్టిఫికెట్‌‌‌‌కూ దిక్కు లేదంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.   పోయిన ప్రభుత్వంలో ఓ ముఖ్యనాయకుడికి ‘ఫామ్ హౌజ్‌‌‌‌’ సమకూర్చిన యజమాని,  నగరం నడిబొడ్డున 30 అంతస్తుల అక్రమ నిర్మాణం జరిపారని సర్కారు పెద్దలు తేల్చారు. ముగ్గురు ఉన్నతస్థాయి కమిషనర్లు స్వయానా సందర్శించి కూడా అవునన్నారు. కానీ, చర్యలేమీ చేపట్టలేదంటే అర్థమేంటి? ‘నిషేధిత భూముల’ జాబితా విషయంలో గత ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించి గద్దెనెక్కిన ప్రస్తుత పాలకుల నిర్వాకం నమ్మిన ప్రజల్ని నట్టే ముంచి, వారిని పెనమ్మీంచి పోయిలో వేసినట్టుంది. అంతకు అయిదింతల భూముల్ని అదనంగా నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చి వీరు జరుపుతున్నదేమిటి? ఏ వివాదం లేని ప్రయివేటు భూములు ఎందుకు నిషేధిత జాబితాలో చేరాయి? ఎవరు బాధ్యులు? నెపం అధికారులపై మోపి, పాలకులు ‘క్షమాపణ’ కోరితే అధికారులెందుకు కిమ్మనటం లేదు? తరాలుగా అనుభవిస్తున్న తమ భూమిని వేరెవరికో మార్చి, వారికి పట్టాదార్ పాస్‌‌‌‌బుక్ కూడా ఇచ్చిన అన్యాయాన్ని సహించలేక, ఎవరూ సహకరించక జహిరాబాద్ ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కలెక్టర్ నివేదికతో సహా ఈ అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు రాష్ట్ర మంత్రి దృష్టికి తెచ్చినా, తీసుకున్న చర్య సున్నా! అక్రమ భూబదలాయింపుల పర్వాన్ని అడ్డుకోజాలక, న్యాయం పొందే మార్గం దొరకక కడుపుమంటతో ఓ రైతు ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన దుస్థితి, తెలంగాణలో అవినీతి బాగోతాలకు పట్టిన అద్దం!  మాజీ  ముఖ్యమంత్రి సహాయకుడొకరి భార్య దగ్గర దర్యాప్తు అధికారులు రూ. 30 కోట్లు గుర్తించడం, ఏపీలో అవినీతి స్థాయిని పట్టిచ్చే పచ్చి ఉదంతం!

పారదర్శకతకు పాతర!

అధికార యంత్రాంగంలో మార్పు రావాలి.  ప్రభుత్వ కార్యాలయాల‌‌‌‌ (దఫ్తర్) పనితీరులో ప్రక్షాళన జరగాలి.  ఏ  సమాచారాన్ని బయటకు పొక్కనీయకుండా గుప్పిట మూసి ఉంచి, అవినీతికి అందలా లెక్కిస్తున్నారు. అన్నీ ప్రజలకు తెలిసేలా జరిగే  పారదర్శకత ప్రతి కార్యాలయంలో అవసరం.  సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) సమర్థంగా అమలు జరిగితేనే అది సాధ్యమౌతుంది.  కార్యాలయాలు, సర్కారు పని ప్రదేశాల్ని మరమ్మతు చేయమని ప్రజలంతా డిమాండ్ చేసే  ‘దఫ్తర్ ఠీక్ కరో’ ఆందోళన రావాలి.  సగటు పౌరులు అటు నాయకులు, ఇటు అధికారులను ప్రశ్నిస్తూ,  నిలదీసినప్పుడే ‘అవినీతి’ అంతమవుతుంది.  ఒక ప్రభుత్వ హయాంలో పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన ఉన్నతాధికారులే తర్వాతి ప్రభుత్వంలోనూ పెద్ద పెద్ద హోదాలు వెలగబెడుతున్నారు. ఘాటుగా విమర్శించినవారే అధికారంలోకి వచ్చి, అదే అధికారుల సేవల్ని ‘మహద్భాగ్యం’గా  పరిగణిస్తున్నారంటే... ఏమిటి అర్థం? ఏదో లాలూచీ వ్యవహారం సాగుతోందన్న మాట! ఈ తెర వెనుక చీకటి కోణాల్లోకి దర్యాప్తు వెలుగు కిరణాలు ప్రసరించాలి. రాజకీయ, అధికార అక్రమార్జనకు అంతం పలికే అవినీతి రహిత పాలనతోనే ప్రజలకు రక్ష. 

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.