చేసిందంతా చేసి.. సారీ అంటే సరిపోద్దా? ..నిషేధిత జాబితాతో పేద రైతులు ఇబ్బందిపడుతున్నరు : బీఆర్ఎస్ లీడర్‌‌ హరీశ్‌రావు 

చేసిందంతా చేసి.. సారీ అంటే సరిపోద్దా? ..నిషేధిత జాబితాతో పేద రైతులు ఇబ్బందిపడుతున్నరు : బీఆర్ఎస్ లీడర్‌‌ హరీశ్‌రావు 
  • పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధం పెట్టాలి
  • రైతులను కబ్జాదారులు అన్న సీఎం క్షమాపణ చెప్పాలి 
  • బీఆర్ఎస్​ లీడర్‌‌ హరీశ్‌రావు డిమాండ్‌

ఆసిఫాబాద్ / కాగజ్‌నగర్/ బెల్లంపల్లి/మంచిర్యాల, వెలుగు: పేద రైతుల భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టడంవల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్‌‌ లీడర్‌‌  హరీశ్‌రావు పేర్కొన్నారు. చేయాల్సిన నష్టం చేసి సారీ అంటే సరిపోతుందా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఫైర్‌‌అయ్యారు. ఆవేదనను చెప్పుకుంటున్న రైతులను సీఎం కబ్జాదారులుగా చిత్రీకరించడం దారుణమని,  రైతులకు  రేవంత్‌ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితాలో చేర్చిన సుమారు 14.50 లక్షల ఎకరాలను వెంటనే తొలగించాలని కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో శుక్రవారం ‘వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు’ పేరుతో బీఆర్‌‌ఎస్‌ నిర్వహించిన సభలో, బెల్లంపల్లిలో వంటావార్పు కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.  ఆయన మాట్లాడుతూ.. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన మంత్రి పొంగులేటిని అసెంబ్లీకి రాకుండా నిషేధంలో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాటిని లాక్కుంటోందని విమర్శించారు. భూమి సూర్యుడి చుట్టు తిరిగితే, రేవంత్​రెడ్డి భూముల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ప్రజల భూములను కబ్జా చేస్తున్నదని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న సీఎం ఇంటిని రాత్రికి రాత్రే లిస్ట్‌లోంచి తొలగించారని, సీఎంకు ఒక న్యాయం రైతులకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు.

రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించకపోతే లక్షలాది మంది ప్రజలతో సెక్రటేరియెట్‌ను ముట్టడిస్తామని, అక్కడ సీఎం లేకపోతే జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సిర్పూర్‌‌ నియోజకవర్గంలోనే 42,867 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని, వెంటనే తొలగించాలన్నారు. వెయ్యి రోజుల రేవంత్ పాలనలో వెయ్యి కుంభకోణాలు జరిగాయని విమర్శించారు.  

ధరణికి, 22ఏకి ఎలాంటి సంబంధం లేదు 

మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, ఇండ్ల  సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హరీశ్​రావు డిమాండ్ చేశారు.  మంచిర్యాల మార్కెట్​ ఏరియాలో 22ఏ బాధితులతో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మాట్లాడుతూ.. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారి భూములను కబ్జా చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణికి, కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకొచ్చిన 22ఏకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

వ్యవసాయ భూముల కోసం ధరణి పని చేసిందని, 22ఏ జీవోతో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడి వేల మంది భూములను లాక్కున్నారని, వెయ్యి సెటిల్‌మెంట్లు  చేశారని అన్నారు.   మంచిర్యాల జిల్లాలో 5,525 ఎకరాల వ్యవసాయ భూములను, 10 వేల ఇండ్లను నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పట్టాలిచ్చిన  సింగరేణి కార్మికులకు చెందిన 6,222 ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.