ఆదిలాబాద్ కుప్టి బ్రిడ్జిపై టమాట లారీ, సిమెంట్ లారీ ఢీ..భారీగా ట్రాఫిక్ జామ్

ఆదిలాబాద్  కుప్టి బ్రిడ్జిపై టమాట లారీ, సిమెంట్ లారీ ఢీ..భారీగా ట్రాఫిక్ జామ్

ఆదిలాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరడిగొండ మండలం కుప్టి బ్రిడ్జిపై టమాటా లారీ, సిమెంట్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు రోడ్డుపైనే బోల్తా పడగా.. లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ భారీ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డుకి రెండు వైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుప్టి వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలలో ఒకదానిపై మాత్రమే రాకపోకలకు అధికారులు అనుమతించగా.. మరో బ్రిడ్జిపై గత కొన్ని రోజులుగా మరమ్మత్తులు కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులు అత్యంత నత్తనడకన సాగుతుండటంతోనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు.

ఒకే బ్రిడ్జిపై ఇరువైపులా వాహనాలను అనుమతించడం వల్లే ఈ ముప్పు పొంచివుందని వాపోతున్నారు. ఇప్పటికైనా సంభవించిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి