ఏఐ, డేటాలదే భవిష్యత్..డేటా సెంటర్లు, కంటెంట్ రంగాల్లోనూ అవకాశాలు: కేటీఆర్

ఏఐ, డేటాలదే భవిష్యత్..డేటా సెంటర్లు, కంటెంట్ రంగాల్లోనూ అవకాశాలు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఏఐ, డేటా రంగాలదే భవిష్యత్తు​అని.. డేటా సెంటర్లు, సర్వర్లు, ఏఐ, కంటెంట్​రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్​కేటీఆర్​ అన్నారు. శుక్రవారం ఆయన గచ్చిబౌలిలో కాన్​స్టర్​ సొల్యూషన్స్​ సంస్థ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..గత రెండు దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని అత్యంత దగ్గరగా చూశానన్నారు. తానూ కార్పొరేట్​ప్రపంచంలో పనిచేశానని గుర్తుచేశారు.

ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ వినియోగం, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిల్వ చేయడం, నిర్వహించడం, ప్రపంచానికి చేరవేయడంలో కాన్‌స్టర్ వంటి సంస్థలకు కీలకపాత్ర ఉంటుందని చెప్పారు. నేటి తరం సమాచారాన్ని పొందే విధానమే పూర్తిగా మారిపోయిందని చెప్పారు. గతంలో వార్తాపత్రికలను పేజీ పేజీగా చదివే రోజులు ఉండేవని, ఇప్పుడు యువతరం మొబైల్ ఫోన్‌ స్వైప్ చేస్తూ ప్రపంచాన్ని చూస్తోందని పేర్కొన్నారు.

ప్రతి స్వైప్ వెనుక భారీ స్థాయిలో కంటెంట్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ జరుగుతోందని.. ఈ డిజిటల్ విప్లవంతో డేటా, స్టోరేజ్ రంగాల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు. కాన్‌స్టర్ సొల్యూషన్స్ టైర్-2, టైర్-3 నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రతిభావంతులైన యువతను ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు తీసుకురావడం కంటే, కంపెనీలు వారివద్దకే వెళ్లి అవకాశాలు కల్పించాలని సూచించారు. టైర్-2, టైర్-3 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఉన్న సరైన ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తే సంస్థలు అద్భుతంగా ఎదగగలవని  పేర్కొన్నారు.