- బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్.రాంచందర్ రావు ఫైర్
- వందేమాతరాన్ని గౌరవించని వాళ్లు దేశభక్తులు ఎలా అవుతారని ప్రశ్న
- ఓటు బ్యాంకు కోసమే సీఎం రేవంత్ ప్రశంసలు అని కామెంట్
హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఒవైసీ బ్రదర్స్ దేశభక్తులంటూ ప్రశంసలు కురిపించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. అలాంటి వారికి దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడం యావత్ దేశాన్ని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తులు అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని.. అలాంటి మహోన్నత నాయకులతో ఒవైసీలను పోల్చడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఏ అర్హతను చూసి ఒవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘గతంలో 15 నిమిషాలు పోలీసులను పక్కకు జరిపితే ఈ దేశంలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తామని బెదిరింపులకు దిగినందుకా?’ అని ప్రశ్నించారు. అసెంబ్లీలో వందేమాతరం పాడుతుంటే ఒక్కరంటే ఒక్క మజ్లిస్ ఎమ్మెల్యే గానీ, ఒవైసీతో సహా ఎవ్వరూ కూడా నిలబడలేదన్నారు.
మరి అలాంటి వాళ్లను దేశభక్తులు అనడం హాస్యాస్పదమన్నారు. మరోవైపు పద్మారావునగర్సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తల్లి శ్రీదేవిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, శ్రీరామ్ వెంకట్, నాయకులు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కుటుంబంపై జరిగిన దాడిని బీజేపీ నేతలు ఖండించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడికి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
