- ఈ నెల 10న చలో హైదరాబాద్ సక్సెస్ చేయాలి: టీపీటీఎఫ్
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీజీటీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 10న నిర్వహించే ‘చలో హైదరాబాద్’సాధన సభను సక్సెస్ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. శుక్రవారం అబిడ్స్‌లోని రాష్ట్ర కార్యాలయంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తుంటే వారిని పలుచన చేసేలా సీఎం మాట్లాడటం సరికాదన్నారు.
పీఆర్సీ, ఆరు పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ టీచర్ల బిల్లులు క్లియర్ చేయడంతోపాటు ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, బాహ్య మూల్యాంకన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. 2010కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ రద్దు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
