- 65 లక్షల టన్నుల సేకరణకు సర్కారు సిద్ధం
- డిమాండ్‌పై స్టడీకి ఏడు సన్నరకాల ఎంపిక
- బియ్యం ఎగుమతుల పెంపునకు ఏర్పాట్లు చేయాలి
- పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సివిల్సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రూ.18,250 కోట్ల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 3,180 ఐకేపీ, 4,372 పీఏసీఎస్, 731 ఇతర కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
అక్టోబర్ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నందున అక్టోబర్ 1 నాటికే అన్ని కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం.. గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న రకాల ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ అందజేస్తామని చెప్పారు. బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, కేఎన్‌ఎం–1638, జై శ్రీరామ్, హెచ్‌ఎంటీ–సోనా, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాలకు బోనస్ వర్తిస్తుందని వివరించారు.
119.57 లక్షల టన్నుల ధాన్యం అంచనా
ప్రస్తుత వానాకాలంలో 57.70 లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనాతోపాటు119.57 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇందులో 45 లక్షల టన్నుల సన్న, 20 లక్షల టన్నుల దొడ్డు ధాన్యాన్ని సివిల్సప్లయ్స్సంస్థ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ధాన్యం రాక భారీగా ఉండే అవకాశం ఉన్నందున గోదాములు, గన్నీ సంచులు, లారీలు, హమాలీలు, తూకం, నాణ్యత పరీక్ష పరికరాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సీజన్‌కు 16.25 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 3.50 కోట్ల సంచులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లారీల లభ్యతను ముందుగానే నిర్ధారించాలని, వాటికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేయాలని మంత్రి ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా సరిహద్దు తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సూచించారు.తెలంగాణ బియ్యానికి దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా, కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
