అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా  చర్యలు తీసుకోండి : మంత్రి శ్రీధర్ బాబు

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా  చర్యలు తీసుకోండి : మంత్రి శ్రీధర్ బాబు
  • అధికారులతో స్పీకర్, మండలి చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు సమావేశం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. శనివారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన సమావేశంలో వారు పలు కీలక సూచనలు చేశారు.

సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో  సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులు ఎప్పటికప్పుడు సమగ్ర సమాచారం అందించాలని, నోట్స్‌‌‌‌‌‌‌‌ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంచాలని స్పీకర్ కోరారు.

సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉన్నందున, అసెంబ్లీ వద్ద ధర్నాలు, రాస్తారోకోలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఉభయ సభల సమావేశాలు ప్రశాంతంగా జరగడమే ప్రభుత్వ కార్యనిర్వాహక వ్యవస్థ సమర్థతకు నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.