హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బిల్లులు, సీపీఎస్ రద్దు, ఈహెచ్ఎస్ అమలు వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ నేతలు ముజీబ్, శ్యామ్ డిమాండ్ చేశారు. శనివారం నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడిన వారు.. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 10న 'చలో హైదరాబాద్'లో భాగంగా ఎల్బీ స్టేడియంలో 'ఉద్యోగుల హక్కుల సాధన సభ' నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి లక్ష మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ సభకు హాజరవుతారని తెలిపారు.
ఇప్పటికే పోలీసులకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నామని, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సెక్యూరిటీ సమస్య ఉంటే సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సభ జరగదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేని 30 సమస్యలను కూడా ఇప్పటివరకు పరిష్కరించలేదన్నారు. తాము ఉచిత పథకాలు అడగట్లేదని, కేవలం 14 లక్షల మంది ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసమే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నేతలు సత్యనారాయణ గౌడ్, కస్తూరి వెంకట్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
