బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

బొగ్గు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
  • మంత్రి పొన్నంతో కలిసి రివ్యూ మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పూర్తి సమన్వయంతో పనిచేయాలని జెన్కో, ట్రాన్స్ కో డిస్కం అధికారులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. భవిష్యత్తులో విద్యుత్ కొరత తలెత్తకుండా సరిపడా పకడ్బందీ దీర్ఘకాలిక ఇంధన ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. బొగ్గు నిల్వలు, రవాణా తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, పవర్‌‌‌‌ ప్లాంట్ల నిరంతర నిర్వహణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శనివారం ఆయన ప్రజాభవన్ లో ఇంధన శాఖపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఉత్పత్తి సామర్థ్యం, బొగ్గు నాణ్యతను నిరంతరం కొనసాగించే అంశాలపై అధికారులతో చర్చించారు.ఒడిశాలోని నైనీ గనిలో బొగ్గు ఉత్పత్తి పురోగతిని సమీక్షించారు. నైనీ గని నుంచి తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సకాలంలో తరలించేందుకు అవసరమైన రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లపై అధికారులతో డిస్కస్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు భట్టి సూచించారు. గనిలో ఉత్పత్తి నుంచి తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు చేరే వరకు ఎక్కడా జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు, సంస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ఇంధన భద్రతలో నైనీ గని కీలక పాత్ర పోషించేలా పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. పెరగనున్న విద్యుత్ డిమాండ్‌‌‌‌ను ముందుగానే అంచనా వేసి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని భట్టి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.