పాపం పాకిస్థాన్‌: 17 ఏళ్లలో 15 సార్లు చిత్తు.. దాయాదిపై భారత్దే ఆధిపత్యం

పాపం పాకిస్థాన్‌: 17 ఏళ్లలో 15 సార్లు చిత్తు.. దాయాదిపై భారత్దే ఆధిపత్యం

India vs Pakistan: మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో భారత బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. పక్కా ప్రణాళికతో, పవర్ ఫుల్ స్వింగ్ బౌలింగ్‌తో విరుచుకుపడి పాకిస్థాన్ జట్టును కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా, మ్యాచ్‌పై సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. అనంతరం క్రీజులోకి దిగిన ఇండియన్ టీమ్ కేవలం 8.4 ఓవర్లలోనే మ్యాచ్ ని ఫినిష్ చేసేసి, మరో చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

17 ఏళ్ల టీ20 చరిత్ర.. 15 మ్యాచ్‌ల్లో టీమిండియాదే పైచేయి: 

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గత 17 ఏళ్లుగా పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 2009లో ఇరు జట్ల మధ్య ప్రారంభమైన ఈ పొట్టి ఫార్మాట్ పోరులో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరగగా, అందులో ఏకంగా 15 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించి తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. మిగిలిన 3 మ్యాచ్‌ల్లో మాత్రమే పాకిస్థాన్ గెలిచింది. 2009 తొలి ప్రపంచకప్‌లోనే పాక్‌ను 75 పరుగులకు ఆలౌట్ చేసి విజయాల పరంపర ప్రారంభించిన ఇండియా, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.

పాక్ గెలిచిన ఆ 3 మ్యాచ్‌లు ఇవే: 

పాకిస్థాన్ జట్టు భారత్‌పై సాధించిన ఆ మూడు విజయాలు కూడా స్వల్ప తేడాతో వచ్చినవే కావడం గమనార్హం. 2012 ప్రపంచకప్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో గెలిచిన పాక్, 2016 టీ20 ప్రపంచకప్‌లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో రెండు రన్స్ తేడాతో నెగ్గింది. ఆ తర్వాత 2022 ఆసియా కప్‌లో 13 పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఏ రోజూ భారత్‌ను ఏకపక్షంగా ఓడించలేకపోయిన పాకిస్థాన్, ప్రతీసారి గెలవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

2022 తర్వాత వరుస విజయాలు.. ట్రోఫీపైనే భారత్ కన్ను: 

2022 ఆసియా కప్ ఓటమి తర్వాత పుంజుకున్న భారత ఉమెన్స్ టీమ్, వరుసగా 4 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. దుబాయ్‌లో తాజాగా సాధించిన ఈ ఘన విజయం టీమిండియాకు రాబోయే నాకౌట్ మ్యాచ్‌లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని అందించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యంత బలంగా కనిపిస్తున్న భారత జట్టు, ఈ ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలవడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతోంది.