మరోసారి ఫైనల్లో సాత్విక్–చిరాగ్.. చైనా ఓపెన్‌‌ మాస్టర్స్‌‌–750 టైటిల్ కోసం ఫైట్!

మరోసారి ఫైనల్లో సాత్విక్–చిరాగ్.. చైనా ఓపెన్‌‌ మాస్టర్స్‌‌–750 టైటిల్ కోసం ఫైట్!

షెంజెన్‌‌: ఇండియా డబుల్స్‌‌ షట్లర్‌‌ సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి జోడీ.. చైనా ఓపెన్‌‌ మాస్టర్స్‌‌–750 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన సెమీస్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–15, 18–21, 21–11తో నూర్‌‌ మొహ్మద్‌‌ అజ్రిన్‌‌ అయుబ్‌‌–టాన్‌‌ వీ కియోంగ్‌‌ (మలేసియా)పై గెలిచారు. ఫలితంగా ఈ సీజన్‌‌లో రెండో టైటిల్‌‌కు అడుగు దూరంలో నిలిచారు. గంటా ఐదు నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ద్వయం వ్యూహాత్మకంగా ఆడింది. తొలి గేమ్‌‌లో ఆధిపత్యం చూపెట్టినా.. రెండో గేమ్‌‌లో తడబడింది. స్కోరు 18–18 వద్ద వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌‌ను చేజార్చుకుంది. అయితే స్మాష్‌‌లతో చెలరేగిన సాత్విక్‌‌ స్కోరు 1–1 తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస పాయింట్లతో మలేసియా జంటపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. బలమైన స్మాష్‌‌లు, ర్యాలీలతో ప్రత్యర్థులను కట్టి పడేశారు. 2023, 2025లో రన్నరప్‌‌గా నిలిచిన సాత్విక్‌‌–చిరాగ్‌‌ ఈసారి టైటిల్‌‌ గెలవాలని పట్టుదలగా ఉన్నారు.