- నేడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపు
- హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నేతలతో సమావేశం
హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ ముఖ్యనేతలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సమావేశమయ్యారు.
మంత్రి శ్రీధర్ బాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాకుండానే జీతం తీసుకుంటూ, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే నేడు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
