నిండుకుండలా ఎల్లంపల్లి..  20 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ

నిండుకుండలా ఎల్లంపల్లి..  20 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ
  •     47 వేల క్యూసెక్కుల భారీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో
  •     మిడ్ మానేరుకు 6,300 క్యూసెక్కులు
  •     ఎస్సారెస్పీ నిండకపోవడంతో ఎల్లంపల్లి శ్రీపాద సాగర్​పై రైతులకు పెరిగిన ఆశలు
  • 20 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ

పెద్దపల్లి, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 20.17 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 19 టీఎంసీల నీరు చేరింది. దీంతో నంది మేడారం పంపుల ద్వారా 6,300 క్యూసెక్కుల నీటిని మిడ్ మానేరుకు వదులుతున్నారు. నాలుగు రోజుల కింద 13 టీఎంసీల నీరు మాత్రమే ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో శుక్రవారం నాటికి 19 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టులోకి 47 వేల క్యూసెక్కుల భారీ ఇన్‌‌‌‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సగానికే పరిమితమైన ఎస్సారెస్సీ..

పెద్దపల్లి జిల్లా రైతులు ఎస్సారెస్సీపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టులో 60 టీఎంసీల నీళ్లుంటేనే ఆయకట్టుకు నీటిని వదులుతారు. నిరుడు ఆగస్టులోనే నీటిని విడుదల చేయగా ఈ సారి ఇప్పటికీ ప్రాజెక్టులోకి అనుకున్నంత నీరు చేరలేదు. ఈ నెలాఖరులోగా మంచి వర్షాలు పడకపోతే ఎస్సారెస్సీ నుంచి నీటి విడుదల సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. దీంతో రైతులు పూర్తిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదే ఆధారపడాల్సి ఉంటుంది.