ప్రభుత్వాన్ని నిషేధిత జాబితాలో చేర్చే టైమొచ్చింది:మాజీ మంత్రి కేటీఆర్

ప్రభుత్వాన్ని  నిషేధిత జాబితాలో చేర్చే టైమొచ్చింది:మాజీ మంత్రి కేటీఆర్
  • పేదల భూములతో చెలగాటమా?
  • కొలువులు అడిగితే లాఠీచార్జ్​​ చేస్తున్రు
  • కరీంనగర్ సభలో మాజీ మంత్రి కేటీఆర్

కరీంనగర్/రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ నాయకులకు తిన్నది అరగక కేసీఆర్ రాజీనామా చేయాలని అంటున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్​ అయ్యారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ రాజీనామా చేయాల్నా? లేదా వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయని రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్నా? అని ప్రశ్నించారు. 2006లో ఇదే కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ రాజీనామా చేయాలని మాట్లాడితే.. ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్ వీపు పగులగొట్టారని అన్నారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయితదో ఆయనే కేసీఆర్ అని.. అందుకే ఆయనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. 

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో విద్యార్థి, యువతతో కలిసి శనివారం నిర్వహించిన యువ సమర భేరీ సభకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేయనందుకు ఆయన 420 సార్లు రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఒక్క మంత్రిని బర్తరఫ్ చేసుడు కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్నే బర్తరఫ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చి చెలగాటమాడుతోందని, అందుకే ఆ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టే రోజులు వస్తాయని అన్నారు. 

ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ మూడేండ్లయినా ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. జాబ్ నోటిఫికేషన్లు లేవు కానీ.. లూటిఫికేషన్ మాత్రం జోరుగా సాగుతోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో మాట్లాడిన రాహుల్ గాంధీ అడ్రస్ లేకుండా పోయిండని, ఆయనకు రాష్ట్రానికి వచ్చేందుకు ముఖం లేదని అన్నారు. యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పి.. బూతు డిక్లరేషన్ ప్రకటిస్తున్నారని వ్యాఖ్యానించారు.  

‘‘ప్రైవేట్‌‌‌‌‌‌‌‌లో 75 శాతం రిజర్వేషన్.. పిల్లగాళ్లకు రూ.10 లక్షల రుణం ఇస్తామంటివి. అడిగితే మళ్లీ కొత్త కొత్త బూతులు, కొత్త కొత్త మాటలే తప్ప చేసిందేమీ లేదు.. కొలువులు అడిగితే లాఠీచార్జీలు చేస్తున్నరు’’ అని ప్రభుత్వంపై మండిపడ్డారు.‘‘పోలీస్ వాళ్లు డ్యూటీ చేయండి కానీ అతి చేయకండి.. రెండేండ్లలో కేసీఆర్ తిరిగి రాబోతున్నరు. గుర్తుపెట్టుకుంటాం. ఎవ్వడినీ వదిలిపెట్టం. అతి చేసిన ఒక్కొక్కడినీ రిటైర్ అయినా, ఎక్కడికిపోయినా, సప్త సముద్రాలు అవతల ఉన్నా.. పట్టికొచ్చి ఏం చేయాలో చేసి చూపెడతాం’’ అని హెచ్చరించారు.  

పాలిటెక్నిక్ కాలేజీ ఆస్తులపై సర్కారు కన్ను

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్లతో కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మాసబ్‌‌‌‌‌‌‌‌ట్యాంక్‌‌‌‌‌‌‌‌తోపాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడిందని,  జీవో 97 వెనుక అసలు ఉద్దేశాన్ని అసెంబ్లీలో ఎండగడతామని పేర్కొన్నారు. 

జీవో 97ను రద్దు చేసే వరకు.. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. అనంతరం చేనేత కళాకారుడు నల్ల విజయ్ అధునాతన యంత్రాలపై ఉత్పత్తి చేస్తున్న వస్త్రాన్ని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించారు.