నకిరేకల్ అభివృద్ధికి రూ.344 కోట్లు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం

నకిరేకల్ అభివృద్ధికి రూ.344 కోట్లు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం
  •  సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన గ్రాండ్​ సక్సెస్​ అయ్యింది. నియోజకవర్గ ప్రగతి బాటలో భాగంగా మొత్తం రూ. 344.92 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. నకిరేకల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా వికాస సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాంగ్రెస్ శ్రేణులు, జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. నకిరేకల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల అయిన సాగునీటి స్వప్నం నెరవేరిందన్నారు. బ్రాహ్మణ వెళ్లంల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించడంతో నకిరేకల్ కోరిక తీరిందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన నకిరేకల్ ప్రాంతాన్ని తమ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో ప్రగతి పథంలోకి తీసుకువచ్చిందన్నారు. 

నియోజకవర్గంలో ఇంకా మిగిలి ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని, ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  సంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులందరికీ నాణ్యమైన, ఉన్నతమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.  ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా చూసేందుకు, వారి ముంగిటకే సేవలను తీసుకువస్తూ ప్రజా పాలన అండగా నిలుస్తోందని చెప్పారు. 

కార్యక్రంలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి,  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు  కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల  లక్మా రెడ్డి, బాలు నాయక్, నల్గొండ కలెక్టర్ బి.చంద్ర శేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.