నకిరేకల్: నకిరేకల్ బహిరంగ సభ వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవర్తనా తీరు ఆసక్తికర చర్చకు దారితీసింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా.. సీఎం రేవంత్ రెడ్డితో.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేదిక పైనే మంతనాలు జరిపారు.
ముఖ్యమంత్రితో చాలా తీవ్రంగా చర్చిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించ గానే సభకు హాజరైన ప్రజల నుంచి హర్ష ధ్వానాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉండగా.. ఒక పక్క సీఎం సభ జరుగుతుంటే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనుందని హైదరాబాద్ వెళ్లడం గమనార్హం. సొంత జిల్లాలో ముఖ్యమంత్రి సభ జరుగుతుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనుందని వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
►ALSO READ | ఇప్పుడైతే 70.. సీట్లు పెరిగితే 117.. తెలంగాణలో కాంగ్రెస్‌దే మళ్లీ పవర్: సీఎం రేవంత్
మొత్తంగా.. సీఎం నకిరేకల్ పర్యటనలో కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో పార్టీ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి, ఎప్పుడు ఏ పదవి ఇవ్వాలో అధిష్టానమే చూసుకుంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలోనే హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రాజగోపాలరెడ్డి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన లక్ష్యమని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
