ఇప్పుడైతే 70.. సీట్లు పెరిగితే 117.. తెలంగాణలో కాంగ్రెస్‎దే మళ్లీ పవర్: సీఎం రేవంత్

ఇప్పుడైతే 70.. సీట్లు పెరిగితే 117.. తెలంగాణలో కాంగ్రెస్‎దే మళ్లీ పవర్: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‎దే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాలు పెరిగితే 117 సీట్లు గెలుస్తం.. ఇప్పుడున్న నియోజకవర్గాలే ఉంటే 90 స్థానాలు గెలిచి రెండోసారి అధికారం చేపడతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ కాసుకోవాలని చాలెంజ్ చేశారు. బీఆర్ఎస్‎ అనే మొక్కను తెలంగాణలో మళ్లీ మొలకెత్తినివ్వమని సవాల్ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‎కు వెయ్యి రోజుల్లో రూ.22 కోట్లు ఖర్చు అయ్యిందని.. ప్రభుత్వ సొమ్ము తీసుకుని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. ప్రజల సొమ్ము తింటూ.. ప్రజా సమస్యలు ప్రస్తావించరా అని ప్రశ్నించారు. అధికారం పోవడంతో సంపాదన లేక బావ, బామ్మర్ది ఏడుస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్‎ను విమర్శించారు.

శనివారం (సెప్టెంబర్ 5) నకిరేకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నకిరేకల్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజుల పాలన పూర్తి అయ్యిందని తెలిపారు. వెయ్యి రోజుల్లో అద్భుతమైన పథకాలు అమలు చేశామన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు దుర్మార్గులు మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలన.. మా 1000 రోజుల పాలన బేరీజు వేసుకోండని ప్రజలను కోరారు. గత ప్రభుత్వ పథకాలను రద్దు చేయకుండా కొనసాగిస్తామన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పల కుప్పగా మార్చిందని అన్నారు.

►ALSO READ | మహిళల ఉచిత బస్సు స్కీమ్‎పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. చివరకు నిరుద్యోగులు, రైతుల ఉసురు తగిలి కేసీఆర్ ఫామ్ హౌస్‎కే పరిమితమయ్యారని హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని.. అలాగే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్‎తో పాటు పలు అభివృద్ధి పనులు చేశామన్నారు.