మాస్కో: దాదాపు నాలుగేళ్లుగా సుదీర్ఘంగా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని రష్యా నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపే లక్ష్యంగా దౌత్య చర్చల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం (సెప్టెంబర్ 5) రష్యా చేరుకున్నారు.
అమెరికా ప్రతినిధుల రాక నేపథ్యంలో శనివారం నుంచి ఉక్రెయిన్‌పై మూడు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. పుతిన్ ఆదేశాలతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చింది. మొదటగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ తాత్కాలిక కాల్పలు విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించాడు.
అమెరికా ప్రతినిధులు రష్యా, ఉక్రెయిన్ దేశాలలో పర్యటించే సమయంలో తాము కూడా ఎలాంటి దాడులు చేయబోమని, రష్యా కూడా అదే రీతిలో స్పందించాలని కోరారు. ఉక్రెయిన్ ప్రతిపాదించిన తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందానికి తాజాగా రష్యా అంగీకరించింది. దీంతో ఇరుదేశాల మధ్య మూడు రోజుల పాటు యుద్ధం ఆగిపోనుంది.
►ALSO READ | కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్: లష్కరే తొయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం
నాలుగున్నరేండ్లుగా సాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇరుదేశాల ప్రతినిధులతో దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని రష్యాకు పంపాడు. అమెరికా టీమ్ యుద్ధం ముగింపు కోసం రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో చర్చలు జరపనుంది. మాస్కోలో పుతిన్‌తో చర్చలు ముగిసిన తర్వాత ఈ అమెరికా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకుని జెలెన్‌స్కీతో సమావేశం కానుంది.
