Pakistan Coach: ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఓటమి, రెండో టెస్టులో 194 రన్స్ తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలకు పూనుకుంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు వేయడంతో పాటు మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇమామ్ ఉల్ హక్ సహా ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను టెస్టు జట్టు నుంచి తొలగించింది. సెప్టెంబర్ 9న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టుకు వైట్ బాల్ కోచ్‌గా ఉన్న మైక్ హెస్సన్‌ను రెడ్ బాల్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా పంపించింది.
ఆ నిర్ణయంతో నాకు సంబంధం లేదు: హెస్సన్
సీనియర్ ఆటగాళ్లు రిజ్వాన్, సల్మాన్ అఘా, ఇమామ్‌లను జట్టు నుంచి తప్పించడంపై బర్మింగ్‌హామ్‌లో జరిగిన మీడియా సమావేశంలో మైక్ హెస్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీబీ నన్ను ఆఖరి టెస్టుకు బాధ్యతలు తీసుకోమని కోరే సమయానికే ఆ ముగ్గురు ప్లేయర్స్ ని జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పంపించింది. అక్కడ అసలు ఏం జరిగిందో నాకు ఏం తెలియదు, ఆ నిర్ణయంలో నా పాత్ర ఏమాత్రం లేదన్నాడు. కొత్త ఆటగాళ్ల ఎంపిక, జట్టులో బౌలింగ్ సమతుల్యత తీసుకురావడంలో మాత్రం తాను భాగమయ్యానని పేర్కొన్నాడు.
క్రమశిక్షణా రాహిత్యమే కారణమా?:
రిజ్వాన్, ఇమామ్, అఘాల తొలగింపుకు కేవలం పేలవ ఫామ్ మాత్రమే కాకుండా క్రమశిక్షణా రాహిత్యం కూడా ఒక కారణమనే ప్రచారానికి మైక్ హెస్సన్ వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చాయి. దీనిపై హెస్సన్ మాట్లాడుతూ.. అఘా అద్భుతమైన ప్లేయర్, అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.. బౌలింగ్ విభాగంలో వైవిధ్యం, ఆల్ రౌండర్లను తీసుకురావడానికి కొత్త ప్లేయర్స్ ని చేర్చాం, వారు కొంతకాలంగా కాంపిటీటివ్ క్రికెట్ ఆడకపోయినా మూడో టెస్టులో మంచి ప్రదర్శన చేయగలరని ధీమా వ్యక్తం చేశాడు.
►ALSO READ | బ్యాట్‌తోనే కాదు.. డ్యాన్స్‌తోనూ దుమ్మురేపిన సూర్య భాయ్.. నెట్టింట వీడియో వైరల్!
ఫేక్ వార్తలను నమ్మొద్దు.. మూడో టెస్టుపైనే మా దృష్టి:
ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌ల జట్టు ఎంపికలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇది కేవలం తాత్కాలిక బాధ్యత మాత్రమేనని కోచ్ మైక్ హెస్సన్ స్పష్టం చేశారు. జట్టుపై వస్తున్న తప్పుడు కథనాలను తీవ్రంగా ఖండించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో సుదీర్ఘంగా చర్చించానని, వివాదాలన్నింటినీ పక్కనపెట్టి బర్మింగ్‌హామ్‌లో జరగబోయే చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించడమే తమ ప్రధాన లక్ష్యమని హెస్సన్ తేల్చి చెప్పాడు.
