శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్ 4) భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. భద్రత దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతయ్యాడు. మరణించిన టెర్రరిస్టును పాకిస్తానీ జాతీయుడైన యాసిర్‌గా గుర్తించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. యాసిర్ లష్కర్-ఎ-తైబా ఉగ్రవాద సంస్థలో కమాండర్‌గా పని చేశాడు.
అధికారుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని పఖేర్పోరా నుంచి బుద్దామ్లోని యూస్మార్గ్ వైపు ఉగ్రవాదుల బృందం ప్రయాణిస్తోందన్న ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 4) భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి.
బుద్దాంలోనిఅటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం కౌంటర్ ఫైరింగ్ జరిపింది. ఇరుపక్షాల మధ్య జరిగిన భీకరమైన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే రైఫిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
►ALSO READ | విమానంలో గొడవ చేస్తున్నాడని.. ఇలా కట్టేశారు.. చేయి, కాళ్లు, మూతికి ప్లాస్టర్లు
ఎవరీ యాసిర్..?
ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. లష్కర్-ఎ-తైబా ఉగ్రసంస్థకు చెందిన సులేమాన్ మూసా గ్రూపులో యాసిర్ పని చేసేవాడు. అయితే, ఏడాది క్రితం ఆ గ్రూపు నుంచి విడిపోయిన యాసిర్ బుద్గామ్‌లో స్వతంత్రంగా పనిచేస్తున్నాడు. భద్రతా సంస్థలు కొంతకాలంగా నిఘా పెట్టి అతని కదలికలను గమనిస్తున్నాయి. ఈ క్రమంలోనే యుస్మార్గ్ ప్రాంతంలో ఉన్నాడన్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు సైన్యం ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా దళాల చేతిలో యాసిర్ హతమయ్యాడు.
