దమ్ముంటే తండ్రీకొడుకులు శాసన సభకు రండి: నకిరేకల్ గడ్డపై సీఎం రేవంత్ సవాల్

దమ్ముంటే తండ్రీకొడుకులు శాసన సభకు రండి: నకిరేకల్ గడ్డపై సీఎం రేవంత్ సవాల్

నకిరేకల్: దమ్ముంటే తండ్రీకొడుకులు శాసన సభకు రావాలని.. శాసనసభలోనే లెక్కలన్నీ తేల్చుకుందామని కేసీఆర్, కేటీఆర్కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. నకిరేకల్లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

30 నెలల్లో రైతుల కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామని.. దీనిపై శాసనసభలో చర్చించేందుకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. కొంతమంది సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఫెయిల్‌ అయ్యాయని ఊరూరా తిరుగుతున్నారని సీఎం మండిపడ్డారు.

ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజాపాలనను గుడ్డిగా విమర్శిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనను.. ఈనాటి ప్రజా ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను చూడండని.. వెయ్యి రోజుల ప్రజా పాలనను బేరీజు వేయండని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సూచించారు. గత సర్కారు అమలు చేసిన పథకాలను ఈ సర్కారు ఏనాడైనా రద్దు చేసిందా అని ఆయన ప్రశ్నించారు.

మంచి పథకాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఆనాడు లక్ష రూపాయల రుణ మాఫీ చేశారా అని సీఎం రేవంత్ నిలదీశారు. అప్పటి ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణ మాఫీ చేస్తే మిత్తీకి సరిపోలేదని సీఎం ఎద్దేవా చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చి కూడా మోసం చేశారని ఆయన విమర్శించారు.

ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని వేల కోట్లు దిగమింగారని సీఎం ఆరోపించారు. రైతు బంధు పేరుతో కూడా మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తాము 2 లక్షల రుణ మాఫీ చేశామని.. రుణమాఫీపై సిద్ధిపేట అయినా.. సిరిసిల్లలో అయినా చర్చకు తాను రెడీ అని సీఎం రేవంత్ ఛాలెంజ్ చేశారు.