ఉప్పల్ ప్రజలకు గుడ్ న్యూస్.. మురికి కూపం నుంచి.. జలకళ వరకు ఉప్పల్ నల్లచెరువు...

ఉప్పల్ ప్రజలకు గుడ్ న్యూస్.. మురికి కూపం నుంచి.. జలకళ వరకు ఉప్పల్ నల్లచెరువు...

హైదరాబాద్ లో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పడ్డ హైడ్రా దూకుడు పెంచింది. ఎక్కడికక్కడ ఆక్రమణలు తొలగిస్తూ చెరువులను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మాదాపూర్, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో చెరువులను కాపాడిన హైడ్రా కృషితో ఇప్పుడు ఉప్పల్ నల్ల చెరువు రూపురేఖలు మార్చుకుంది. మురికి కూపం నుంచి జలకళ సంతరించుకుంది నల్ల చెరువు. సెప్టెంబర్ నెలాఖరు లోపు ఉప్పల్ నల్లచెరువు ప్రారంభానికి సన్నాహాలు చేస్తోంది హైడ్రా. ఈ క్రమంలో నల్లచెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

ఆక్రమణలతో 52.30 ఎకరాలకు పరిమితమైన ఉప్పల్ నల్లచెరువులో ఆక్రమణలు తొలగించి 67.31 ఎకరాలకు విస్తరించింది హైడ్రా. చెరువు చుట్టూ 2.4 కిలోమీటర్ల బండ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. అన్ని వయసుల వారు సేదతీరేలా గజీబోలు, కుర్చీల ఏర్పాటు చేశారు. చెరువులోకి వరద నీరు సులభంగా చేరేలా ఇన్‌లెట్లు అభివృద్ధి చేశారు. చెరువు నిండిన తర్వాత వరద ముప్పు లేకుండా ఔట్‌లెట్ అభివృద్ధి చేశారు. చెరువు చుట్టూ ఆక్రమణల తొలగింపులో సడలింపు లేదని స్పష్టం చేసింది హైడ్రా.

అనంతరం మాధాపూర్‌లో తమ్మిడికుంట, సున్నం చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. తమ్మిడికుంటలో బయో వ్యర్థాలు, మురుగునీరు పూర్తిగా తొలగించారు. చెరువు కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల యూనిట్ల తొలగింపునకు ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్. ప్లాస్టిక్ వ్యర్థాల కేంద్రాలను వెంటనే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రంగనాథ్.

►ALSO READ | దమ్ముంటే తండ్రీకొడుకులు శాసన సభకు రండి: నకిరేకల్ గడ్డపై సీఎం రేవంత్ సవాల్

సున్నం చెరువు బండ్‌పై వ్యూపాయింట్ ఏర్పాటు చేయాలని.. చెరువుల పరిసరాల్లో పచ్చదనం మరింత పెంచాలని ఆదేశించారు. చెరువు పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 

అనంతరం కృష్ణాకాంత్ పార్క్ చెరువును పరిశీలించారు రంగనాథ్. కృష్ణాకాంత్ పార్క్ చెరువు లోతు, విస్తీర్ణం పెంచితే వరద ముప్పు తగ్గుతుందని అన్నారు.వరద నీరు నేరుగా చెరువులోకి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కృష్ణానగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వరద ముప్పు తగ్గే అవకాశం ఉందని.. శ్రీనివాసనగర్, అమీర్‌పేట ప్రాంతాలు నీట మునిగే ప్రమాదాన్ని నివారించేలా చెరువు అభివృద్ధి చేయాలని అన్నారు రంగనాథ్.