- కొండా సురేఖ నిష్క్రమణతో పెరిగిన ఆశలు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో కొద్దిరోజులుగా నడుస్తున్న కోల్డ్ వార్‌కు నకిరేకల్ వేదికగా బ్రేక్ పడింది. కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై అసంతృప్తితో ఉంటూ, జిల్లాలో జరిగిన వరుస ప్రభుత్వ సభలకు దూరంగా ఉంటున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు శనివారం నకిరేకల్ ప్రజా వికాస సభలో ప్రత్యక్షమవడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి ఆశించారు.
మొదటి విడత విస్తరణలో ఆయనకు అవకాశం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న అధికారిక, పార్టీ కార్యక్రమాలకు, జిల్లాలో నిర్వహించిన ముఖ్యమైన సమీక్షా సమావేశాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఇటీవల మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చాయి.
ఈ క్రమంలో నకిరేకల్ సభకు హాజరుకావాలని తనను పిలవాలంటూ రాజగోపాల్ రెడ్డి స్వయంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి కోరినట్లు సమాచారం. వెంటనే స్పందించిన అడ్లూరి.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మాట్లాడారు. వీరేశం ఈ విషయాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంఓ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. వీరేశం అధికారికంగా రాజగోపాల్ రెడ్డిని సభకు ఆహ్వానించారు. దీంతో ఇరు వర్గాల మధ్య సాఫీగా సంబంధాలు నెలకొల్పేలా పరిస్థితులు అనుకూలించాయి.
ఈ నేపథ్యంలో నకిరేకల్ సభకు రాజగోపాల్ రెడ్డి భారీ అనుచరగణం, పెద్ద కాన్వాయ్‌తో వచ్చారు. సభ జరుగుతున్నంత సేపూ ఆయన సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చున్నారు. సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడకపోయినా.. ఆయనే సెంటర్ పాయింట్ అయ్యారు. వేదికపై ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో ప్రియ మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అని ప్రస్తావించగానే.. కార్యకర్తలు, అభిమానుల కేకలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. సీఎం రేవంత్ కూడా తన ప్రసంగంలో రాజగోపాల్ రెడ్డిని మిత్రుడు అంటూ సంబోధించారు.
