- తెలంగాణ నుంచే ప్రారంభిస్తం
- కులగణనలో తెలంగాణ ఆదర్శం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- జనగణనలో కులగణనపై కేంద్రాన్ని బీజేపీ నేతలు ఒప్పించాలి: మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఓబీసీలను చైతన్యపరిచేందుకు వంద రోజుల పాటు గర్జన సదస్సులు నిర్వహించనున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్చార్జ్ కొప్పుల రాజు చెప్పారు. శనివారం గాంధీ భవన్లో ఈ ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు. కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శమని, సీఎం రేవంత్ రెడ్డి శాస్త్రీయంగా కులగణన చేపట్టి పూర్తి చేశారని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. ఓబీసీ హక్కుల గర్జన వంద రోజుల కార్యక్రమాన్ని తెలంగాణలో సక్సెస్ చేస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఓబీసీ గణనపై ఇచ్చిన నినాదం ఉద్యమంలా మారిందన్నారు.
జనగణనలో కులగణన చేసేందుకు ప్రధాని మోదీని ఇక్కడి బీజేపీ నేతలు ఒప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో ఆ పార్టీ ఉండాలా.. వద్దా.. అనేది బీజేపీ నేతల ఇష్టమన్నారు. కులగణనపై మాట్లాడితే తమ పదవులు ఎక్కడ పోతాయోనన్న భయంతో రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారని అన్నారు. బిహార్ ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పిన కేంద్రం, ఎన్నికల తర్వాత మాట తప్పిందన్నారు.
సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ మాత్రమేనని పొన్నం స్పష్టం చేశారు. కొప్పుల రాజు మాట్లాడుతూ.. గత ఐదేండ్లుగా రాహుల్ గాంధీ, ఖర్గే.. జనగణనతో పాటు కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ అంశాన్ని దేశ వ్యాప్తంగా ఉద్యమంలా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. ఇదే అంశంపై పార్లమెంట్ లో కేంద్రాన్ని కాంగ్రెస్ పలుమార్లు నిలదీసిందన్నారు. జనగణన ఫారంలో ఓబీసీ ప్రస్తావనే లేదన్నారు. కేంద్రం వెంటనే కులగణనతోపాటే ఓబీసీ లెక్కలను చేపట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదు
రాష్ట్ర మంత్రవర్గ విస్తరణ ఇప్పట్లో లేదని పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. దీనిపై అధిష్టానం నుంచి కూడా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయమని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ సందర్భంగా కేబినెట్ విస్తరణపై చర్చే జరగలేదన్నారు.
కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశంపై మాత్రమే చర్చించామని చెప్పారు. కొండా సురేఖను అందరం కలిసి కాపాడే ప్రయత్నం చేశామని, కానీ ఆమె విషయంలో అధిష్టానం ఆగ్రహంగా ఉండడంతో తమ ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందనే వార్తలపై స్పందిస్తూ దీనిపై తనకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.
