- మైనింగ్ కార్యకలాపాల కోసం విచ్చలవిడిగా బ్లాస్టింగ్స్
- తాజాగా ధర్మసాగర్ లో ఇద్దరు చిన్నారులకు తప్పిన ప్రాణాపాయం
- తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు
హనుమకొండ/ ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో మైనింగ్ కార్యకలాపాల కోసం వినియోగిస్తున్న పేలుడు పదార్థాలు జనాల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తీసుకొస్తున్న వ్యక్తులు.. మైనింగ్ బ్లాస్టింగుల కోసం విచ్చలవిడిగా ఉపయోగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఈ పేలుళ్లతో జనాల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నా జిల్లా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. కంప్రెషర్ బండ్ల మాటున కొంతమంది పేలుడు పదార్థాల దందా సాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
జిలెటిన్ స్టిక్స్ కేరాఫ్ ధర్మసాగర్..
హనుమకొండ జిల్లాల్లోని ధర్మసాగర్, ఐనవోలు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, శాయంపేట, ఆత్మకూరు, నడికూడ, తదితర మండలాల్లో మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవాదుల రిజర్వాయర్ చుట్టూ గుట్టలు ఉండటంతో వాటిపై కన్నేసిన కొంతమంది మైనింగ్ వ్యాపారులు పేలుడు పదార్థాలు ఉపయోగిస్తూ బ్లాస్టింగులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కేవలం గుట్టలనే కాకుండా మొరం, మట్టి దందా చేసే వ్యాపారులు కూడా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్ మండల కేంద్రంతో పాటు ఉనికిచెర్ల, దేవునూరు, నారాయణగిరి తదితర గ్రామాల్లో కంప్రెషర్ బండ్లు నడిపే వ్యక్తుల వద్ద జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. తమకు తెలిసిన అక్రమ మార్గాల్లో పేలుడు పదార్థాలు తీసుకొస్తున్న దుండగులు కొన్ని అక్రమ దందాల్లో పాలుపంచుకుంటూ బాంబుల మోతతో చుట్టుపక్కల గ్రామాలను వణికిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నో రూల్స్.. ఓన్లీ బ్లాస్టింగ్స్
వాస్తవానికి జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు వినియోగించే వ్యక్తులు ఎక్స్ ప్లోజివ్స్ రూల్స్ 2008, పెట్రోలియం అండ్ ఎక్స్ ప్లోజీవ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నిబంధనల ప్రకారం బ్లాస్టింగులకు సంబంధించిన సామగ్రిని ఉపయోగించడానికి కచ్చితమైన రూల్స్ పాటించాలి. జిలెటిన్ స్టిక్స్ కొనుగోలు చేయడానికి, వాటిని ఉపయోగించడానికి పెసో లైసెన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలి. బ్లాస్టింగులు జరిపేందుకు కూడా ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఉండాలి. అంతేగాకుండా ఈ పేలుడు పదార్థాలను ఇండ్లు, జనావాసాల్లో నిల్వ చేయకుండా ప్రత్యేక గోదాముల్లో మాత్రమే స్టోర్ చేయాలి. కానీ, ఇక్కడ అదంతా ఏమీ జరగకుండానే కొంతమంది అక్రమంగా యాదాద్రి భువనగిరి, ఆలేరు నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తీసుకొస్తున్నారు. ఇండ్లలోనే స్టోర్ చేస్తూ మట్టి, మొరం, రాతి గుట్టలకు పెట్టి పేల్చేస్తున్నారు.
పేలుతున్నా నో యాక్షన్!
మైనింగ్ దందా కోసం వినియోగిస్తున్న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల కారణంతో జిల్లాలో తరచూ ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఈ నెల 4న ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలోని ఓ క్రషర్ వద్ద డిటోనేటర్లు కనపడగా, అవేంటో తెలియని ధనరాజ్(13), నాగరాజు(11) ఇద్దరు బాలురు వాటిని తీసుకుని ఇంటికి వెళ్లగా, అవి ఒక్కసారిగా పేలాయి. ఈ ప్రమాదంలో నాగరాజు చేతి వేళ్లు ఛిద్రమవగా, ధనరాజ్ కంటికి తీవ్ర గాయమైంది.
గతేడాది జూన్ లో ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపంలోని పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఆ సమయంలో పక్కనే కోళ్ల ఫామ్ లో పని చేస్తున్న వ్యక్తులపై రాళ్లు పడి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో మూడేండ్ల బాబు సహా మరో యువకుడు ఉన్నారు. అంతుకుముందు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ధర్మసాగర్ కి చెందిన ఓ హోటల్ లో ఐదుగురు వ్యక్తులు జిలెటిన్ స్టిక్స్ పేల్చి నానా హంగామా సృష్టించారు.
కొద్దిరోజుల కిందట ఉనికిచెర్లకు చెందిన ఓ కంప్రెషర్ బండి ఓనర్ ఓ ప్రైవేటు వెంచర్ లో ఇలాగే పేలుళ్లకు పాల్పడగా, స్థానికులు గొడవకు దిగారు.
దాదాపు రెండేండ్ల కిందట భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో గుట్టపైకి వెళ్లిన ఓ కుక్క డిటోనేటర్ ను నోట కరిచి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలే జిల్లాలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ ల విచ్చలవిడి వినియోగానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
- ఆఫీసర్లు సైలెంట్ !
క్షేత్రస్థాయిలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల వినియోగం అమాయకుల ప్రాణాల మీదకు తెస్తుండగా, ఆఫీసర్లు అన్నీ తెలిసీ సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లతో ముప్పు పొంచి ఉన్నా మైనింగ్, పోలీస్ ఆఫీసర్లు ఆ విషయం తమ పరిధి కాదని తప్పించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో నిందితులను అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిందిపోయి మామూళ్ల మత్తులో పంచాయితీలు చేసి, రాజీ కుదురుస్తున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి క్షేత్రస్థాయిలో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర పేలుడు పదార్థాల వినియోగంపై ఫోకస్ పెట్టాలని స్థానికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
