టీచర్స్ డే రోజున సచిన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. తండ్రి పేరుతో ఫెలోషిప్!

టీచర్స్ డే రోజున సచిన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. తండ్రి పేరుతో ఫెలోషిప్!

న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన తండ్రి, తొలి గురువు అయిన రమేశ్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌కు.. క్రికెట్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ సచిన్‌‌‌‌ హృదయపూర్వక నివాళి అర్పించాడు. అదే టైమ్‌‌‌‌లో ఆయన జ్ఞాపకార్థం ‘ప్రొఫెసర్‌‌‌‌ రమేశ్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ మెమోరియల్‌‌‌‌ ఫెలోషిప్‌‌‌‌’ను ప్రకటించాడు. పెదవి చీలిక (క్లెఫ్ట్‌‌‌‌), కపాలముఖ సంరక్షణ (క్రానియో ఫెసియల్‌‌‌‌ కేర్‌‌‌‌)తో ఎండీ (డాక్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌) చేసే ఒక విద్యార్థికి ఆర్థికంగా సాయం అందించనున్నాడు. సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌కు దీర్ఘకాలంగా ఆరోగ్య సంరక్షణ భాగస్వామిగా ఉన్న ఇంగా హెల్త్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌తో కలిసి ఈ ఫెలోషిప్‌‌‌‌ను ఇవ్వనున్నాడు. 


తన ప్రయాణం క్రికెట్‌‌‌‌ మైదానంలోనో, కోచ్‌‌‌‌తోనో మొదలు కాలేదని, ఇంట్లోనే మొదలైందని  సచిన్​ వెల్లడించాడు. ‘నా ప్రయాణాన్ని తీర్చిదిద్దిన వ్యక్తుల గురించి నేను ఆలోచించినప్పుడు, నేను క్రికెట్ మైదానంతోనో లేదా కోచ్‌‌‌‌తోనో ప్రారంభించను. నేను ఇంట్లో నుంచే ప్రారంభిస్తాను. నాకు చిన్నప్పట్నించి క్రికెట్‌‌‌‌ అంటే ఇష్టం. మా నాన్న నాలో అంతకంటే ఎక్కువే చూశారు. నేను ఏమవ్వాలో నిర్ణయించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. స్వయంగా తెలుసుకునేందుకు అవసరమైన స్వేచ్ఛను ఇచ్చాడు. నా తండ్రి జ్ఞాపకార్థం కోసమే ఈ ఫెలోషిప్‌‌‌‌ను ఏర్పాటు చేశాను. మా నాన్న నమ్మిన సిద్ధాంతం ఇదే. విద్యే అవకాశాలను సృష్టిస్తాయని ఆయన భావించారు. అది ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన పరమార్థం మరొకటి ఉండదు’ అని సచిన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లో ట్వీట్‌‌‌‌ చేశాడు.