‘సర్‌‌‌‌‌‌‌‌’ పేరుతో బీజేపీ ఓట్లను తీసేస్తున్రు..సికింద్రాబాద్‌‌‌‌లో లక్షలాది ఓట్ల తొలగింపుపై అనుమానాలు:  రాంచందర్ రావు 

‘సర్‌‌‌‌‌‌‌‌’ పేరుతో బీజేపీ ఓట్లను తీసేస్తున్రు..సికింద్రాబాద్‌‌‌‌లో లక్షలాది ఓట్ల తొలగింపుపై అనుమానాలు:  రాంచందర్ రావు 
  • విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, టీచర్ల ఉసురు పోస్కుంటున్నరని ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓట్ల తొలగింపు ప్రక్రియ ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చూసి ఓడిపోతామనే భయంతో, కుట్రపూరితంగా బీజేపీ ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో బీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన ఓబీసీ, మున్నూరు కాపు సంఘం యువనేతలు పలువురు బీజేపీలో చేరారు.

వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి కంచుకోటలాంటి సికింద్రాబాద్ పరిధిలో లక్షలాది మంది ఓట్లను ఏరివేస్తున్నారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారిని, బీజేపీకి అనుకూలంగా ఉండేవారిని టార్గెట్ చేస్తున్నారని, చివరకు బీజేపీ నేతల కుటుంబ సభ్యుల ఓట్లకూ టెక్నికల్ కారణాలతో నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో ఎస్ఐఆర్ తర్వాతే ఎన్నికలు జరిగినా అక్కడ కాంగ్రెస్ గెలిచిందని.. ఇక్కడ మాత్రం ఈ ప్రక్రియ ద్వారా బీజేపీ గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అనడం ఓటమి భయానికి నిదర్శనమన్నారు.

విద్యాశాఖపై పట్టింపు లేదు.. 

కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సగటు విద్యాబడ్జెట్ 14.5 శాతం ఉంటే, రాష్ట్రంలో 9 శాతానికే పరిమితం చేయడం దారుణమన్నారు. స్వయంగా సీఎం చేతిలోనే విద్యాశాఖ ఉన్నప్పటికీ.. యూనివర్సిటీల్లో నియామకాలు లేవు, బడుల్లో టీచర్లు లేరని విమర్శించారు. టీచర్లకు పెన్షన్లు, ప్రమోషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, ఫీజు రీయింబమర్స్‌‌‌‌మెంట్ బకాయిలు ఆపడంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో స్టాఫ్‌‌‌‌కు జీతాలు కూడా అందడం లేదన్నారు.

దావోస్ పర్యటనలతో వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటున్న ప్రభుత్వం.. ఇప్పటివరకు రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి.. ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, ఇంటిగ్రేషన్ పేరుతో సాంకేతిక విద్యను నాశనం చేయాలని చూస్తే బీజేపీ సహించదన్నారు.