- టోర్నీ నుంచి అమాండా అనిసిమోవా ఔట్
- టెయిల్ ఫ్రిట్జ్, ఫ్లావియో కొబొలి కూడా..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. గతంలో యూఎస్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన 10వ సీడ్ అమాండా అనిసిమోవా టోర్నీ నుంచి వెనుదిరిగింది. మూడో రౌండ్‌లో ఆమె 24వ సీడ్ అనస్తాసియా పొటపోవా చేతిలో 6-2, 7-5 తేడాతో ఓటమిపాలైంది.
అలాగే జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకా మూడో రౌండ్‌లో ఘన విజయం సాధించింది. ఆమె13వ సీడ్ ఎలిస్ మెర్టెన్స్‌ను 6–3, 3–-6, 7–-5 తేడాతో ఓడించి ప్రి క్వార్టర్స్‌లోకి అడుపెట్టింది. నిర్ణాయక మూడో సెట్‌లో 4-–2తో వెనుకబడినప్పటికీ ఆమె పుంజుకుని సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలుస్తానని తాను అసలు అనుకోలేదని గెలుపు సాధించిన అనంతరం ఒసాకా పేర్కొంది.
టెయిల్ ఫ్రిట్జ్‌కు నిరాశ
మెన్స్ సింగిల్స్‌లో 9వ సీడ్ టెయిల్ ఫ్రిట్జ్ పరాజయం పాలయ్యాడు. తొలి 2 సెట్లు గెలిచి ఆధిక్యంలో నిలిచినప్పటికీ, ఆ జోరును కొనసాగించలేకపోయాడు. ఫ్రాన్సిస్కో సెరుండోలో చేతిలో 3-–6, 4–-6, 6–-3, 6-–4, 6–-4 తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, 5వ సీడ్ ఫ్లావియో కొబొలి 7–6, 3–6, 0–6, 3–6 తేడాతో 28వ సీడ్ అలెగ్జాండర్ బ్లాక్స్ చేతిలో ఓటమి చవిచూశాడు. తాజా పరిణామాలతో మెన్స్ సింగిల్స్‌లో టాప్-–10 సీడ్స్‌లో ఆరుగురు ఆటగాళ్లు ఇప్పటికే నిష్క్రమించారు.
