న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ను పురస్కరించుకుని సోషల్ మీడియాలో భారీ డిస్కౌంట్లతో నెయ్యి విక్రయిస్తున్న దుకాణాలపై ఢిల్లీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 322 కిలోలకు పైగా నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల నాణ్యత, ధరలు, లేబులింగ్‌పై అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
బై వన్ గెట్ వన్ ఫ్రీ, 60 శాతం వరకు డిస్కౌంట్లంటూ ప్రచారం చేస్తున్న దుకాణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. కల్తీ, నాణ్యత లేని, గడువు ముగిసిన లేదా సరైన లేబులింగ్ లేని ఆహార పదార్థాలు విక్రయించకుండా తనిఖీలు నిర్వహించారు. వికాస్పురిలోని మ్యాక్స్కార్ట్ స్టోర్, అగర్వాల్ స్టోర్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు వివిధ బ్రాండ్లకు చెందిన నెయ్యి నుంచి ఐదు నమూనాలు సేకరించారు. ఇతర ఆహార పదార్థాల నుంచి మరో ఐదు నమూనాలను తీసుకున్నారు. ఈ దుకాణాల నుంచి 75.50 లీటర్లకు పైగా నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.
హస్తాల్ గ్రామంలోని అగర్వాల్ స్టోర్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ శ్రీ షాన్, వృందా ఫార్మ్స్, అవతార్ బ్రాండ్లకు చెందిన నెయ్యి నుంచి మూడు నమూనాలను సేకరించారు. ఈ దుకాణం నుంచి 246 కిలోల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.సేకరించిన నమూనాలను ప్రయోగశాలలకు పంపించి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇతర ఆహార పదార్థాల విక్రయాలపైనా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆజాద్ మార్కెట్ లోని వికాన్ ఇంటర్నేషనల్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాహిబ్ సన్స్ దుకాణంలో చక్కెరతో తయారు చేసిన మిఠాయిలకు సంబంధించి లేబులింగ్ అనుమానాలపై రెండు నమూనాలు సేకరించారు.లజ్‌పత్ నగర్జై లో న్ స్టోర్‌లో మఖానా, పసుపు పొడి నమూనాలను సేకరించారు.రిథాలాలో యుగ్ బాస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రెండు రకాల బిస్కెట్లు, సాఫ్ట్ క్యాండీ, చక్కెరతో తయారు చేసిన క్యాండీల నమూనాలను తీసుకున్నారు.
తనిఖీలు నిర్వహించిన కొన్ని సంస్థల్లో ఆహార భద్రత, లేబులింగ్ నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనలు గుర్తించినట్లు శాఖ వెల్లడించింది. నిబంధనల ఉల్లంఘనలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార కల్తీ, అక్రమాలను ప్రభుత్వం సహించబోదని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పష్టం చేశారు. వినియోగదారులు ఆహార పదార్థాలను కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, ప్యాకేజింగ్, తయారీ తేదీ, గడువు తేదీలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. పండుగల సమయంలో భారీ డిస్కౌంట్లకు ఆకర్షితులై ఆహార పదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
