టీమిండియాకు ఆడాల్సిన స్టార్ హీరో.. ఒక్క గాయంతో మారిన జీవితం.. విష్ణు విశాల్ సక్సెస్ స్టోరీ ఇదే!

టీమిండియాకు ఆడాల్సిన స్టార్ హీరో.. ఒక్క గాయంతో మారిన జీవితం.. విష్ణు విశాల్ సక్సెస్ స్టోరీ ఇదే!

టీమిండియా జెర్సీ ధరించి దేశం తరఫున ఆడాలన్నది అతడి కల. చెపాక్ స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కానీ అతనికి ఒక గాయం ఊహించని షాక్ ఇచ్చింది. క్రికెట్ కెరీర్‌కు బ్రేక్ పడటంతో జీవితమే మారిపోయింది. చివరకు బ్యాట్ పట్టాల్సిన చేతులు కెమెరా ముందుకు వచ్చాయి. ఒకప్పుడు మైదానంలో క్రికెటర్ గా సత్తా సాటిన ఆ స్టార్.. ఇప్పుడు సినిమాల్లో హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయనే తమిళ నటుడు విష్ణు విశాల్. 

చెపాక్‌లో మొదలైన క్రికెట్ కల..

విష్ణు విశాల్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ప్రాణం. క్రికెట్‌లోనే కెరీర్ నిర్మించుకోవాలనే లక్ష్యంతో చెన్నైకి వచ్చిన ఆయన.. చారిత్రక చెపాక్ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడారు. అక్కడ ఎల్. బాలాజీ, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, మురళీ విజయ్ వంటి క్రికెటర్లతో కలిసి ఆడారు. ఆయనకు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ఎంతో ప్రత్యేకం. ఓ మ్యాచ్‌లో 60 బంతుల్లో 55 పరుగులు చేసి తన ప్రతిభను చాటుకుని.. తమిళనాడు అండర్-19 జట్టులో చోటు సంపాదించారు. అంతేకాదు, భారత్ అండర్-16, అండర్-19 స్థాయుల్లోనూ ఆడినట్లు ఆయన గతంలో విష్ణు విశాల్ వెల్లడించారు.

 

ఒక్క గాయంతో మారిన జీవితం..

క్రికెట్‌లో మంచి భవిష్యత్తు కనిపిస్తున్న సమయంలో కాలికి తగిలిన తీవ్రమైన గాయం ఆయన కలలకు అడ్డుకట్ట వేసింది. చాలా కాలం ఆటకు దూరంగా ఉండటంతో పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో సినిమాలు చూడటం అలవాటైంది. అలా మొదలైన ఆసక్తి క్రమంగా నటన వైపు అడుగులు వేయించింది. క్రికెట్‌ను వదులుకోవాల్సి వచ్చినా.. జీవితంలో మరో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు అదే పరిస్థితి మార్గం చూపించింది.

 

తెరపై క్రికెటర్‌గా రెండుసార్లు..

నిజ జీవితంలో క్రికెటర్‌గా కొనసాగలేకపోయినా, వెండితెరపై మాత్రం తన కలను సాకారం చేసుకున్నారు విష్ణు విశాల్. 2014లో వచ్చిన 'జీవా' చిత్రంలో క్రికెటర్‌గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 2024లో రజనీకాంత్ కథ, స్క్రీన్‌ప్లేకు సంబంధించిన 'లాల్ సలామ్' చిత్రంలోనూ క్రికెట్ నేపథ్యంలోని పాత్రలో కనిపించారు. అంతేకాదు, 'వెన్నిలా కబడ్డీ కుళు' వంటి చిత్రాలతో క్రీడా నేపథ్య కథలకు దగ్గరయ్యారు.

ఒకప్పుడు మైదానంలో టీమిండియా జెర్సీ ధరించాలని కలలు కన్న విష్ణు విశాల్.. ఇప్పుడు వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గాయం ఆయన క్రికెట్ ప్రయాణాన్ని ఆపేసినా, జీవితంలో విజయం సాధించాలనే పట్టుదలను మాత్రం ఆపలేకపోయింది. అందుకే విష్ణు విశాల్ కథ కేవలం ఓ నటుడి విజయగాథ మాత్రమే కాదు.. ఓటమి తర్వాత కూడా కొత్త కలను వెతుక్కోవచ్చని చెప్పే స్ఫూర్తిదాయక ప్రయాణం నేటి తరానికి ఎంతో మార్గదర్శకం.